న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పాక్

పాకిస్థాన్ క్రికెట్‌ను న్యూజిలాండ్ చంపేసిందని షోయెబ్ అక్త‌ర్‌ ఆరోపణ

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య సెప్టెంబర్ 17  నుంచి ప్రారంభం కావాల్సిన మూడు వన్డేల సిరీస్‌.. మొదటి మ్యాచ్ కు కొద్ది గంటల ముందే రద్దైంది. న్యూజిలాండ్ ప్ర‌భుత్వం నుంచి భద్రతా పరమైన సూచనలు రావటంతో ఈ సిరీస్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా, దీంతో 2003 త‌ర్వాత మ‌ళ్లీ అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌కు వేదిక అవుతుంద‌నుకున్న పాకిస్థానీల‌కు తీవ్ర నిరాశే మిగిలింది. 

దీనిపై పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్లు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. పాకిస్థాన్ క్రికెట్‌ను న్యూజిలాండ్ చంపేసింద‌ని మాజీ ఫాస్ట్ బౌల‌ర్ షోయెబ్ అక్త‌ర్ ట్వీట్ చేశారు. ఉత్తుత్తి బెదిరంపు కాల్‌తో కివీస్ టూర్‌ను ర‌ద్దు చేసుకుంద‌ని, దీని వ‌ల్ల ఎంత న‌ష్టం అవుతుందో తెలుసా అని అఫ్రీది ట్వీట్ చేశారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ కూడా నిర్వేదాన్ని వ్య‌క్తం చేశారు. అక‌స్మాత్తుగా సిరీస్‌ను వాయిదా వేయడం బాధాక‌ర‌మ‌ని, ఈ సిరీస్ జ‌రిగితే ల‌క్ష‌లాది మంది పాక్ క్రికెట్ అభిమానులు సంతోషించేవార‌ని, త‌మ భద్రతా దళాల సామ‌ర్థ్యంపై న‌మ్మ‌కం ఉన్న‌ట్లు బాబ‌ర్ త‌న ట్వీట్‌లో వెల్లడించారు. 

పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య సెప్టెంబర్ 17 నుంచి అక్టోబరు 3వ తేదీ వరకు మూడు వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు పాక్ ఆతిథ్యమిచ్చింది. కివీస్ జట్టు 18 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టడంతో దీనిని రికార్డు సిరీస్‌గా భావించారు. కానీ ఇది జరగలేదు.