రూ.100 కోట్ల ఖర్చుతో ఆర్టీసీకి కొత్త బస్సులు

అత్యధికంగా కొనుగోళ్లలో సూపర్ లగ్జరీ బస్సులకే మొగ్గు

హైదరాబాద్‌: రూ.100 కోట్ల ఖర్చుతో కొత్త బస్సులు కొనాలని ఆర్టీసీ నిర్ణయించింది. పాత వాటితో ప్రయాణం ఇబ్బందిగా మారటం, వాటి నిర్వాహణ  ఖర్చుల పెరిగిపోవటంతో కొత్త వాటిని తీసుకురావాలని అధికారులు నిశ్చయించారు. ఆర్టీసీ ఆదాయం పెరగాలంటే దూరప్రాంత బస్సుల సంఖ్య పెంచాలని ఇటీవల ఆర్టీసీ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారని వారు తెలిపారు.

బ్యాంకుల నుంచి ఆర్టీసీ రూ.వెయ్యి కోట్లు రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పూచీకత్తు ఇచ్చింది. అందులో ఇప్పటికే రూ.500 కోట్లు ఆర్టీసీకి అందాయి. వాటిని వివిధ అవసరాలకు కేటాయించారు. మరో రూ.500 కోట్లు రానున్నాయి. అందులో రూ.400 కోట్లను ఆర్టీసీ సహకార పరపతి సంఘానికి బకాయిల కింద చెల్లించాలని మిగతా రూ.100 కోట్లతో కొత్త బస్సులు కొనాలని నిర్ణయించారు. అయితే రూ.100 కోట్లతో సుమారు 280 బస్సులు వస్తాయని అంచనా వేస్తున్నారు.

ఆర్టీసీలో దూర ప్రాంతాల మధ్య నడిచే సూపర్‌ లగ్జరీ బస్సులకు డిమాండ్‌ ఎక్కువ. దీంతో కొత్తగా కొననున్న బస్సుల్లో ఈ కేటగిరీవే వందకుపైగా తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. మరో 80 వరకు డీలక్స్‌ బస్సులు కొననున్నారు. ప్రస్తుతమున్న డీలక్స్‌ బస్సుల్లో 80 బస్సులను సూపర్‌ లగ్జరీ సర్వీసులుగా అప్‌గ్రేడ్‌ చేయాలని భావిస్తున్నారు. దీనితో సూపర్‌ లగ్జరీ బస్సులు మరిన్ని పెరుగుతాయి. 

మునుపటి వ్యాసం