నీళ్ల సీసాలను పేలుడు పదార్థాలనుకుని దాడి చేశాం: అమెరికా

తప్పు జరిగిందని ఒప్పుకున్న అగ్రరాజ్యం

వాషింగ్ట‌న్‌: ఆఫ్ఘ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్‌పై ఆగ‌స్టులో జ‌రిగిన డ్రోన్ దాడి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తొమ్మిది మంది అమాయ‌కులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘ‌ట‌న‌పై అగ్రరాజ్యం అమెరికా స్పందిస్తూ.. ఆ డ్రోన్ దాడి చేసింది తామే అని స్ప‌ష్టం చేసింది.

అంత‌ర్జాతీయ ఎయిడ్ వ‌ర్క‌ర్‌గా ఉన్న ఆ వ్య‌క్తి కారును అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు ట్రాక్ చేశారు. ఐఎస్-కే మిలిటెంట్ల‌కు అత‌ను చెంది ఉంటార‌ని అత‌ను ఉంటున్న ఇంటిపై దాడి చేసిన‌ట్లు యూఎస్ సెంట్ర‌ల్ క‌మాండ్ జ‌న‌ర‌ల్ కెన్నెత్ మెకంజీ తెలిపారు. ఓ ఇంటి కాంపౌండ్‌లో ఆ వ్య‌క్తి  కారులో పేలుడు ప‌దార్ధాలు లోడింగ్ చేస్తున్న‌ట్లు డ్రోన్ ద్వారా గుర్తించామ‌ని, కానీ వాస్త‌వానికి అవి వాట‌ర్ బాటిళ్లు అని తేలిన‌ట్లు అమెరికా స్ప‌ష్టం చేసింది.

ఆ డ్రోన్ దాడి ఓ విషాద‌క‌ర పొర‌పాటు అని జ‌న‌ర‌ల్ మెకంజీ తెలిపారు. అయితే ఇంటెలిజెన్స్ స‌మాచారం అందించిన వారిలో తాలిబ‌న్లు లేర‌ని ఆయ‌న తెలిపారు. కాబూల్ విమానాశ్ర‌యాన్ని తాలిబ‌న్లు ఆక్ర‌మించిన అనంతరం అక్క‌డ బాంబు దాడి జ‌రిగిన కొన్ని రోజుల‌కు అమెరికా ద‌ళాలు డ్రోన్ దాడి చేసింది. ఆగ‌స్టు 29వ తేదీన జ‌రిగిన దాడిలో తొమ్మిది మంది మృతి చెందారు. దాంట్లో ఏడు మంది చిన్నారులు కూడా ఉన్నారు. 

 

మునుపటి వ్యాసం