కోర్టు దాకా రాకుండా సక్రమంగా విచారణ జరపాలి: ఏపీ హైకోర్టు

అక్రమ కస్టడీపై ఏపీ ఉన్నత న్యాయస్థానం విచారణ

అమరావతి: అక్రమ కస్టడీ విషయంలో కోర్టు దాకా రాకుండా సక్రమంగా విచారణ జరపాలని ఏపీ ఉన్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. అక్రమ పోలీసు కస్టడీ విషయంలో నమోదైన హెబియస్ కార్పస్ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఓ కేసులో పోలీసులు అన్యాయంగా తమను అరెస్ట్ చేశారని హైకోర్టులో అక్తర్ రోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో వాస్తవాలను హైకోర్టుకు లా అండ్ ఆర్డర్ ఏడీజీ తెలిపారు. ఏడీజీ  నివేదిక  ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారని అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. నివేదికను అడ్వకేట్ జనరల్‌కు అందించాలని హైకోర్టు సూచించింది. "పదే పదే హెబియస్ కార్పస్ పిటిషన్స్ దాఖలు అవుతున్నాయని, ఇది చాలా విచారకరమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలాంటి కేసుల్లో ఉద్దేశ్యపూర్వకంగానే హెబియస్ కార్పస్ పిటిషన్స్ దాఖలు చేస్తున్నారని ఏజీ పేర్కొన్నారు.

అక్రమంగా కస్టడీకి తీసుకోకుండా సిబ్బందికి ఉన్నతాధికారులు సూచనలను ఇవ్వాలని హైకోర్టు సూచించింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని ఏజీ  తెలిపారు. అరెస్ట్ చేసిన ఇద్దరిని  కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి మెడికల్ రిపోర్ట్స్ హైకోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి ధర్మాసనం వాయిదా వేసింది. 

మునుపటి వ్యాసం