ఆశించిన ఫలితం దక్కలేదు: కోహ్లి

తనకు సహకరించిన యాజమాన్యం, సహాయక సిబ్బందికి ధన్యవాదులని ప్రకటన

హైదరాబాద్: ఆర్సీబీ సారథిగా జట్టుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఉద్వేగభరిత ట్వీట్‌ చేశాడు. ‘మనం ఆశించిన ఫలితం దక్కలేదు. అయితేనేం.. సీజన్‌ ఆసాంతం... మీరందరు పట్టుదలగా పోరాడిన తీరు పట్ల నేను గర్వపడుతున్నాను. కానీ... ఆఖరికి మనకు నిరాశ తప్పలేదు. అయినా మనం తలెత్తుకునే ఉండాలి.

నాకు సహకరించిన యాజమాన్యం, సహాయక సిబ్బంది... మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2021 సీజన్‌ ముగిసిన తర్వాత ఆర్సీబీ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగుతానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు ఇప్పటి వరకు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్‌ సాధించి ఘనంగా కెప్టెన్సీకి వీడ్కోలు పలకాలని కోహ్లి భావించాడు. ః

అయితే, సోమవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో ఆర్సీబీ ఓటమి పాలవడంతో నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతూ ఓ పోస్టు షేర్‌ చేశాడు. ఇక ఈ సీజన్‌లో కోహ్లి... 15 మ్యాచ్‌లు ఆడి 405 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 72(నాటౌట్‌). కెప్టెన్‌గా తొమ్మిదింటిలో ఆర్సీబీని గెలిపించాడు. అయితే, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓటమితో ఈసారి నాలుగో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.