బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రత్యేక కథనం ‌

నేడు సద్దుల బతుకమ్మ

తెలంగాణ రాష్ట్ర విశిష్టమైన పండుగలలో బతుకమ్మ ఒకటి. ఈ పండుగ కేవలం తెలంగాణకు మాత్రమే ప్రత్యేక పండుగ. కాగా, ఇది తెలంగాణ సంస్కృతికి ప్రతీక కూడా. ఈ వేడుకను మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్య రోజు నుండి వరుసగా తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ రోజున ఆడపడుచులు తమ పుట్టింటికి వచ్చి సంబురాల్లో మునిగిపోతారు. 

తంగెడు పూలు, గునుగుపూలు, బంతిపూలు, చామంతి పూలు, గుమ్మడి ఆకులను వరుసగా ఒకదానిపై ఒకటి పేర్చుతూ బతుకమ్మను తయారు చేస్తారు. పళ్లెంలోనో, తాంబాళంలోనో, వెదురు పల్లకిలోనో ఎత్తుగా పేర్చి పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడుతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలి పూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు జరుపుకుంటారు. 

నేడు తొమ్మిదో రోజైన సద్దుల బతుకమ్మ. ఈరోజుతో బతుకమ్మ పండుగ ముగుస్తుంది. అయితే ఈనాడు గౌరీ దేవికి నైవేద్యంగా మలీద (మల్లీల ముద్దలు), పెరుగన్నం, చింతపండు, చిత్రాన్నం, నిమ్మకాయల చిత్రాన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

ఈ మలిద ముద్దలు మొక్కజొన్న లేదా బియ్యం పిండితో చేసిన రొట్టెలను చిన్న చిన్న ముక్కలుగా చేసి దానికి బెల్లం పాకం కలిపి మలీద ముద్దలు చేస్తారు. సాయంత్రం బతుకమ్మల చుట్టూ ఆడి, పాడి చివరకు బావిలోనూ, నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం తరువాత పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం అంటూ వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. 

ఆపై ఇంటి నుంచి తెచ్చిన పెరుగన్నం మరియు సత్తు పిండీలను ఇచ్చిపుచ్చుకుని ఆరగిస్తారు. ఈ పండుగ వల్ల మాంగళ్య బలం, సంపద, క్షేమ లాభాలు సిద్ధిస్తాయని నమ్మకం. శతాబ్దాలుగా జరుపుకుంటున్న ఈ బతుకమ్మ సంబురాలకు వివిధ రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాములు, పెత్తందారి వ్యవస్థలో తెలంగాణ గ్రామీణ సమాజం తీవ్ర అణచివేతను  అనుభవించేది. ముఖ్యంగా మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి ఆకృత్యాలకు ఆడపడుచులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునేవారు.

ఆ ఆడబిడ్డలను తలచుకుని తోటి మహిళలు విచారించే వారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బ్రతుకమ్మ, బతుకమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. పాటల వెనుక ఉండే మర్మమిదే... అయితే బతుకమ్మ పండుగలో ప్రధానంగా కనిపించేవి పువ్వులు, నీరు, ప్రకృతి. 2014 జూన్ 16 న తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. 

తొమ్మిది రోజుల పండుగలో భాగంగా ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత: 

  • మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, ఈ రోజు నైవేద్యంగా నువ్వులు, నూకలు సమర్పిస్తారు. (గౌరమ్మ శివుడి భార్య పార్వతికి మరో పేరు కాబట్టి మొదటి రోజు శివాలయాల్లో బతుకమ్మలు ఆడుతారు)
  • రెండోరోజు అటుకుల బతుకమ్మ- నైవేద్యం ఉడకపెట్టిన పప్పు, బెల్లం, అటుకులు
  • మూడోరోజు ముద్దపప్పుబతుకమ్మ- నైవేద్యం తడిబియ్యం, పాలు బెల్లం
  • నాలుగోరోజు నానబియ్యం బతుకమ్మ- తడిబియ్యం, పాలు, బెల్లం
  • ఐదోరోజు అట్లబతుకమ్మ-  నైవేద్యం అట్లు
  • ఆరోరోజు అలిగిన బతుకమ్మ- నైవేద్యం అట్లు
  • ఏడో రోజు వేపకాయల బతుకమ్మ- నైవేద్యం బియ్యపు పిండిని వేపపండ్ల ఆకారంలో తయారు చేసి దేవికి సమర్పిస్తారు 
  • ఎనిమిదవ రోజు వెన్నెముద్దల బతుకమ్మ- వెన్న, నువ్వులు, బెల్లం
మునుపటి వ్యాసం