హుజూరాబాద్‌ నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో పూర్తి

సాయంత్రం తెలనున్న బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు

కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియనుంది. తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, భాజపా అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 42 మంది బరిలో ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది.

దీంతో ఎంత మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారు, ఎందరు పోటీలో ఉండనున్నారనే విషయంతో సాయంత్రం తెలనుంది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల కమిషన్‌ గుర్తులు కేటాయించనుంది.

ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్‌ 1న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 2న ఫలితాలు వెలువడనున్నాయి. మాజీమంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఉపఎన్నిక తప్పనిసరి అయింది.