వచ్చే నెల15న వరంగల్ లో తెలంగాణ విజ‌య గ‌ర్జ‌న

పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటన

వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నవంబర్ 15వ తేదీన వరంగల్‌లో నిర్వహిస్తామ‌ని తెరాస పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసి, అనేక సవాళ్లను ఎదుర్కొని రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసిన పార్టీగా టీఆర్ఎస్ నిలిచింద‌ని కేటీఆర్ తెలిపారు.

ఆ త‌ర్వాత అద్భుతమైన విధానాలతో పరిపాలన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని  తెలంగాణ విజయ గర్జన పేరుతో జరిగే ఈ సమావేశానికి పార్టీ శ్రేణులు భారీగా హాజరు కావాల‌ని పిలుపునిచ్చారు. తెలంగాణ విజయ గర్జన బహిరంగ సభ సన్నాహక సమావేశాలను ప్రతి నియోజకవర్గంలో అక్టోబర్ 27న‌ నిర్వహించడం జరుగుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.

నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఈ సన్నాహక సమావేశాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఒకటే రోజు నిర్వహించనున్నాం అని కేటీఆర్ తెలిపారు. అందుకు పార్టీ గ్రామ, వార్డు, మండల, పట్టణ, డివిజన్ కమిటీలు, ఆయా అనుబంధ కమిటీల సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు హాజరు కావాల‌న్నారు. లక్షలాదిగా తరలిరావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.