ఆస్తుల‌ను కాపాడుకునేందుకే భాజపా లో చేరిన ఈట‌ల

హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి

క‌మ‌లాపూర్‌: ఈట‌ల రాజేంద‌ర్ స్వార్థ‌ప‌రుడ‌ని, త‌న ఆస్తుల‌ను కాపాడుకునేందుకే భాజపాలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నార‌ని తెరాస ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి విమ‌ర్శించారు. క‌మ‌లాపూర్ మండ‌లంలోని నేరెళ్ల‌, గూడూరు గ్రామాల్లో బుధ‌వారం పర్యటించిన ఆయ‌న హుజూరాబాద్ తెరాస అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్ త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా యాద‌వ కుల‌స్తుల‌తో స‌మావేశ‌మ‌య్యారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ...భూముల క‌బ్జా విచార‌ణ‌లో త‌న బండారం బ‌య‌ట‌ప‌డుతుంద‌నే భ‌యంతోనే ఈట‌ల రాజేంద‌ర్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశార‌ని చెప్పారు. త‌న స్వార్థం కోసం విలువ‌ల‌కు నీళ్లు వ‌దిలి మ‌రీ భాజపా తీర్థం పుచ్చుకున్నార‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వంపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

అన్ని వ‌ర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టింద‌న్నారు. ప్ర‌తిప‌క్షాల మాట‌లు న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని సూచించారు. ఉప ఎన్నికల్లో భాజపా గెలిస్తే ప్ర‌జ‌ల‌కు ఏంచేస్తారో చెప్ప‌కుండా సంక్షేమ స‌ర్కారుపై అవాకులు చెవాకులు పేలుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. కారు గుర్తుకే ఓటేసి గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు.