ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్ప దైవ భక్తుడు

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా గొప్ప దైవ భక్తుడని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు వెంకటరమణారెడ్డి – జ్యోతి నిర్వహించిన నవాహ్నిక చండీ మహా క్రతువులో మంత్రి పాల్గొని పూజలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..హిందువులమని చెప్పుకునే అనేక యజ్ఞాలు, హోమాలు నిర్వహించి వారికి మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చూపించారని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం రాకముందు, వచ్చిన తర్వాత కూడా అనేక యాగాలు, హోమాలు చేశారన్నారు. రాష్ట్ర ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించారన్నారు. తెలంగాణ సంప్రదాయ పండగలను కూడా గౌరవంగా నిర్వహించుకునే విధంగా కేసీఆర్‌ చేశారని గుర్తు చేశారు.

అందుకే వారి కష్టానికి భగవంతుడు కూడా ఫలితాన్ని ఇస్తున్నారని పేర్కొన్నారు. వర్షాలు సమృద్దిగా కురిసి, ప్రజలు అందరూ రెండు పంటలు పండించుకుంటున్నారని తెలిపారు. జడ్పీ పర్సన్ గండ్ర జ్యోతి అన్ని రంగాల్లో నిష్ణాతులుగా ఉండడం విశేషం. ఒక వ్యక్తిలో ఇన్ని లక్షణాలు ఉండడం అరుదని మంత్రి ప్రశంసించారు. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని చేస్తున్న ఈ క్రతువుకు భగవంతుడు ఆశీర్వదించి, ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాన్నానని మంత్రి తెలిపారు.