హన్మకొండలో హెచ్‌పీఎస్‌ కు స్థలం కేటాయింపు

జీవో నెంబ‌ర్ 93ను ప్రభుత్వం జారీ

వరంగల్: వ‌రంగ‌ల్‌లో హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు హ‌న్మకొండ జిల్లా ధ‌ర్మసాగ‌ర్ మండ‌లం ఎలుకుర్తి గ్రామంలో 50 ఎక‌రాల ప్రభుత్వ స్థలాన్ని మార్కెట్ రేటుకు కేటాయిస్తూ జీవో నెంబ‌ర్ 93ను ప్రభుత్వం జారీ చేసింది.

ఈ జీవోను ప్రభుత్వం త‌ర‌పున మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు చేతుల మీదుగా, రాజ్యస‌భ స‌భ్యుడు సురేశ్‌రెడ్డి స‌మ‌క్షంలో సోమవారం హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ సొసైటీ వైస్ ఛైర్మెన్‌ గుస్తీ జె.నోరియాకు అందించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌ ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉందన్నారు.  హైద‌రాబాద్‌లోని బేగంపేట‌, రామాంత‌పూర్, అలాగే క‌డ‌ప త‌ర్వాత వ‌రంగ‌ల్‌లో మ‌రో బ్రాంచీ నడుస్తోందన్నారు.

అలాంటి స్కూలుకు స్థలాన్ని కేటాయించ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌యమని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు నోరియా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మంత్రి ఎర్రబెల్లికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌, హ‌న్మకొండ క‌లెక్టర్ రాజీవ్‌గాంధీ హ‌న్మంతుల‌కు హెచ్‌పీఎస్ స్కూల్ సొసైటీ ఉపాధ్యక్షుడు నోరియా కృత‌జ్ఞత‌లు తెలిపారు. అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న  హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్.. వ‌రంగ‌ల్‌లో గ‌త ఐదేండ్లుగా అద్దె భ‌వ‌నంలో న‌డుస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ప్రభుత్వానికి హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ సొసైటీ అభ్యర్థన పంపింది.  

 

మునుపటి వ్యాసం