సమస్య అంతా ఎన్నికల రిటర్నింగ్ అధికారితోనే: ప్రకాశ్ రాజ్

'మా`ఎన్నికల అధికారి తీరుపై అసంతృప్తి

హైదరాబాద్: 'మా`( మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తీరుపై నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ప్రకాశ్ రాజ్ వర్గం సోమవారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో వీ సీసీటీవీ కెమెరా ఫుటేజిని పరిశీలించింది. అనంతరం ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ఎన్నికల వేళ రికార్డయిన సీసీ కెమెరాల ఫుటేజి ఇవ్వాలని ఇటీవల లేఖ రాస్తే, మొదట సరే అన్నారన్నారు.

కానీ ఏం జరిగిందో ఏమో అని ఆ తర్వాత ఫుటేజి ఇవ్వడం కుదరదని చెప్పారన్నారు. దానికో పద్ధతి ఉంటుందని చెబుతున్నారని, తాము దానికి తగ్గట్టుగానే వెళుతున్నామని చెప్పారు. తనకు విష్ణుతో ఇబ్బంది లేదు అని, సమస్య అంతా ఎన్నికల రిటర్నింగ్ అధికారితోనేనన్నారు.

ఈ రోజు కొంత ఫుటేజి పరిశీలించామని చెప్పిన ఆయన ఇంకా ఏడు కెమెరాలకు సంబంధించిన ఫుటేజి ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వద్దే ఉందన్నారు. దాన్ని కూడా పరిశీలించిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు మాట్లాడుతామని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ చూడాలని చెప్పిందనందుకు విష్ణుకు ప్రకాశ్ రాజ్ థాంక్స్ చెప్పారు.