శ్రీలంక టెస్ట్‌ జట్టు మొదటి సారథి వర్ణపుర మరణం

తీవ్ర విచారం వ్యక్తం చేసిన శ్రీలంక క్రికెట్ జట్టు

న్యూదిల్లీ: ప్రముఖ మాజీ క్రికెటర్, శ్రీలంక టెస్ట్‌ జట్టు మొదటి సారథి బందుల వర్ణపుర(68) సోమవారం తుదిశ్వాస విడిచారు. ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా పరిస్థితి విషమించి షుగర్‌ లెవెల్స్‌ ఒక్కసారిగా పెరిగిపోవడం వల్ల అతను మృతి చెందినట్టు తెలిసింది. ఆయన మరణంపై శ్రీలంక క్రికెట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. శ్రీలంక క్రికెట్ తరపున వర్ణపుర కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

బందుల వర్ణపుర 1970లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. అనంతరం 1982 ఫిబ్రవరిలో కొలొంబొ వేదికగా ఇంగ్లండ్‌తో శ్రీలంక ఆడిన తొలి టెస్ట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. అదేవిధంగా శ్రీలంక తరఫున తొలి బంతిని ఎదుర్కొన్న బ్యాటర్‌గాను, తొలి పరుగు చేసిన ఆటగాడిగా ఆయన రికార్డు సాధించారు. అలాగే శ్రీలంక తరఫున ఓపెనింగ్‌ బ్యాటింగ్‌, ఓపెనింగ్‌ బౌలింగ్‌ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నమోదు చేశారు. 1975 ప్రపంచకప్‌, వన్డే లో కూడా ఆయన అద్భుత ఆటతీరును కనబరిచారు.  ఆయన మొత్తం 4 టెస్ట్‌లు, 12 వన్డేలు ఆడారు. రిటైర్మెంట్‌ అనంతరం అతను శ్రీలంక కోచ్‌గా కూడా వ్యవహరించాడు.