ఈ నెల 26న కొవాగ్జిన్ అత్యవసర వినియోగంపై డబ్లుహెచ్‌వో భేటీ

టీకాకు అనుమతులపై చర్చించనున్నట్టు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడి

జెనీవా: హైదరాబాద్ ప్రాంతానికి చెందిన భారత్ బయోటెక్ సంస్ధ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా ను అత్యవసర వినియోగ జాబితాలో చేర్చడంపై ఈ నెల 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక సలహా బృందం సమావేశం కానుంది. డబ్లుహెచ్‌వో అభ్యర్థన మేరకు గత నెల 27 న అదనపు సమాచారాన్ని భారత్ బయోటెక్ పంపగా ప్రస్తుతం ఆ డేటాను నిపుణుల కమిటీ సమీక్షిస్తోంది.

భారత్ బయోటెక్ సంస్థ ఐసిఎంఆర్‌తో కలిసి దేశీయంగా కొవాగ్జిన్ టీకాను తయారు చేసింది. టీకా అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దేశంలో అత్యవసర వినియోగానికి డిసిజిఐ అనుమతించిన ఆరు వ్యాక్సిన్లలో కొవాగ్జిన్ ఒకటి. దేశం మొత్తం మీద ఇది వినియోగంలో ఉంది. అయితే కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సంబంధించి పూర్తి డేటాను డబ్లుహెచ్‌ఒకి జులై మొదట్లోనే పంపడమైందని భారత్ బయోటెక్ ఇటీవల వెల్లడించింది.

కాగా, టీకాకు అనుమతులపై సమావేశంలో చర్చించనున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్టు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు భారత్ బయోటెక్‌తో కలిసి ప్రపంచ ఆరోగ్య సంస్థ పని చేస్తోందని తెలిపారు. ఈమేరకు విస్తృతమైన టీకా పోర్ట్‌పోలియో ఉండాలన్నది తమ లక్ష్యమని స్వామినాథన్ వెల్లడించారు. స్వదేశంలోని ప్రజలందరికీ టీకా అందుబాటులో ఉండేందుకు కొవాగ్జిన్ ఎగుమతులను భారత్ ఏప్రిల్ లోనే పూర్తిగా రద్దు చేసింది.

మునుపటి వ్యాసం