భారత సైనికుడికి ఇక నుంచి శివుడి చేతిలోని ‘త్రిశూలం’

కాల్పులు జరిపే ఆయుధాలను వినియోగించరాదని ఒప్పందం ఉన్న నేపథ్యంలో త్రిశూలం రూపకల్పన

న్యూదిల్లీ: శివుడి చేతిలోని త్రిశూలం ఇప్పుడు భారత బలగాల చేతిలో ఆయుధంగా మారనుంది. సప్పర్ పంచ్ పేరిట తయారు చేసిన ప్రత్యేక గ్లౌజ్ తొడుక్కొని ఒక్క పంచ్ ఇస్తే ప్రత్యర్థి కింద పడిపోవాల్సిందే. ప్రత్యేకంగా తయారు చేసిన లాఠీలు తాకితే డ్రాగన్ బలగాలు కిందపడి పోవాల్సిందే. గల్వాన్ లోయ వద్ద జరిగిన హింసాత్మక ఘర్షణలో వీరసైనికుల మరణంతో ప్రాణహానిలేని ఆయుధాలపై భద్రతా బలగాలు దృష్టిపెట్టాయి.

చైనాను తిప్పికొట్టేందుకు భారత్ సైన్యం నూతన ఆయుధాలను సమకూర్చుకుంటోంది. సరిహద్దుల్లో కాల్పులు జరిపే ఆయుధాలను వినియోగించరాదని ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉన్న నేపథ్యంలో ప్రాణహాని లేని ఆయుధాలు తయారుచేసింది.  గల్వాన్ ఘర్షణ జరిగిన వెంటనే నోయిడాలోని అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఈ ఆయుధాల తయారీ బాధ్యతను భద్రతా దళాలు అప్పగించాయి.

అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మోహిత్ కుమార్ మాట్లాడుతూ...గల్వాన్ ఘర్షణలో చైనీయులు తమ సంప్రదాయ ఆయుధాలను వాడారనీ, అందుకే తాము కూడా భారత సంప్రదాయాన్ని చాటుతూ త్రిశూలాన్ని తయారుచేసినట్టు వెల్లడించారు.

‘వజ్ర పేరుతో మెరుపులతో కూడిన మెటల్ డివైజ్‌ను మా సంస్థ తయారు చేసింది. శత్రు సైనికులపై దాడి చేసేందుకు వారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పంక్చర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. త్రిశూలం నుంచి కూడా విద్యుత్ సరఫరా అవుతుంది. దాంతో ప్రత్యర్థి సెకెన్ల వ్యవధిలోనే అపస్మారకస్థితికి గురవుతాడు.

సప్పర్ పంచ్ పేరుతో తయారుచేసిన గ్లౌజ్ కూడా ఇదే తరహాలో పనిచేస్తుంది. ఈ ఆయుధాలేవీ శత్రువుల ప్రాణాలు తీయవు. వారిని షాక్‌కు గురిచేస్తాయి’ అని మోహిత్ వివరించారు.

మునుపటి వ్యాసం