చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం

డెహ్రాడూన్: చార్‌ధామ్ యాత్రను ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఉత్తరాఖండ్‌ లో వరుసగా రెండవరోజు భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో  అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలకు వెళ్లే యాత్రికులను వాతావరణం మెరుగుపడేవరకు ముందుకు సాగవద్దని అధికారులు ఆదేశించారు.

బద్రీనాథ్ వెళుతున్న యాత్రికులలో చాలామంది జోషిమఠ్, చమోలిలో నిలిచిపోయినట్లు చమోలి జిల్లా విపత్తు నిర్వహణ అధికారి ఎన్‌కె జోషి తెలిపారు. యమునోత్రికి బయల్దేరిన యాత్రికులను బడ్‌కోట్ జన్కిచట్టి వద్ద నిలిపివేయగా గంగోత్రి యాత్రలో ఉన్న యాత్రికులను హర్సిల్, భట్వారి, మనేరిలో ఉండిపోవాలని ఆదేశించినట్లు ఉత్తరకాశి జిల్లా మెజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ తెలిపారు.

కేదార్‌నాథ్‌కు బయల్దేరిన దాదాపు నాలుగు వేల మంది యాత్రికులను ముందు జాగ్రత్తగా లించోలి, భింబాలి వద్ద నిలిపివేసినట్లు రుద్రప్రయాగ్ విపత్తు నిర్వహణ అధికారి ఎన్‌కె సింగ్ తెలిపారు. భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ వివరణ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్టా యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చార్‌ధామ్ దేవస్థానం బోర్డు సోమవారం ప్రకటించింది. 

మునుపటి వ్యాసం