మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రత్యేక కథనం

ముస్లింల విశ్వాసం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ చివరి ప్రవక్త

దేశవ్యాప్తంగా నేడు ముస్లిం సోదరులు ‘మిలాద్-ఉన్-నబీ’ జరుపుకుంటున్నారు. ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను ముస్లింలు చేసుకుంటారు. ఆయన సౌదీ అరేబియాలోని మక్కాలో క్రీ. శ. 570లో జన్మించి క్రీ. శ.632 వరకు జీవించి అదే రోజున(తేదీన) కాలధర్మం చేశారు.

ముస్లింల చాంద్ర మాన క్యాలండర్ ప్రకారం ఈద్ మిలాద్-ఉన్-నబీ వారి రబీవుల్ అవ్వల్ మాసంలో జరుపుకుంటారు. ముస్లింల విశ్వాసం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ చివరి ప్రవక్త. ఈ పండుగ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం వేర్వేరు తేదీల్లో వస్తుంటుంది. క్రిష్టియన్ క్యాలెండర్‌తో పోల్చి చూసినప్పుడు వేర్వేరు తేదీల్లో కనిపిస్తుంది. 

ఈ పండుగ రోజున ఖురాన్ పఠనం, మసీదుల్లో ప్రసంగాలు, ప్రార్థనలు వంటివి వారు జరుపుకుంటారు. అయితే ఈ పండుగ విషయంలో ముస్లింలలో రెండు తెగలవారు అంటే, సున్నీలు, షియాలు వేర్వేరు భావాలు కలిగి ఉన్నారు. ఆకుపచ్చని రిబ్బన్లు, జెండాలు, బ్యానర్లు వంటివి ఈ రోజున ముస్లింలు ప్రదర్శిస్తారు.

మసీదులు, ఇతర కమ్యూనిటీ భవనాల్లో అన్నదానం, రాత్రుల్లో సైతం మసీదుల్లో ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ రోజున ముస్లింలలోని చాలా తెగలవారు ప్రవక్త పుట్టిన రోజును ఓ పర్వదినంగా భావించరు. ముస్లింలలోని సలాఫీ, వహబీ సిద్ధాంతాలున్నవారు ఈ రోజును పర్వదినంగా ఆచరించరు.