లఖీంపూర్ ఖేరి ఘటనపై రేపు సుప్రీంలో విచారణ

ఏజెన్సీతో దర్యాప్తు జరిపించాలా లేదా అన్నదానిపై రేపు సుప్రీం నిర్ణయం

న్యూదిల్లీ: లఖీంపూర్ ఖేరిలో అక్టోబర్ 3న చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు బుధవారం మరోసారి విచారణ చేపట్టనుంది. ఈ ఘటనపై విజయదశమి పండుగకు ముందు విచారణ జరిపిన జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం యూపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అసంతృప్తిని వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ధర్మాసనం ఆక్షేపించింది. ‘దయచేసి విచారణకు హాజరుకండి’ అంటూ నిందితుడికి సీఆర్‌పీసీ-160 కింద పోలీసులు నోటీసులు ఇవ్వడంపై కన్నెరజేసింది. ‘మిగతా కేసుల్లో నిందితుల విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారా?’అని నిలదీసింది.

మాటలే తప్ప చర్యలు శూన్యం అంటూ యూపీ సర్కారును దుయ్యబట్టింది. తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదావేసింది. లఖీంపూర్ ఖేరీ హింసాత్మక ఘటనపై వేరే ఏజెన్సీతో దర్యాప్తు జరిపించాలా లేదా అన్నదానిపై రేపటి విచారణలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనున్నది.

కాగా, లఖీంపూర్ ఖేరి ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ హింసాత్మక ఘటనపై విచారణ జరపాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శివకుమార్ త్రిపాఠి, సిఎస్ పాండా అనే న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. వీరి అభ్యర్థనను స్వీకరించిన జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం అక్టోబర్ 8వ తేదీన విచారణ చేపట్టింది.