వినియోగదారులకు షాకిచ్చిన ఫోన్ పే

ఫోన్ రిచార్జ్ లపై ప్రాసెసింగ్‌ ఫీ వసూలు ప్రారంభం

హైదరాబాద్: వాల్‌మార్ట్‌ సంస్థకు చెందిన డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే తమ వినియోగదారులకు షాకిచ్చింది. తమ యాప్ ద్వారా ఫోన్‌ రీఛార్జులపై ప్రాసెసింగ్‌ ఫీ వసూలు చేయడం ప్రారంభించింది. రూ.50 కంటే అధిక విలువ కలిగిన మొబైల్‌ రీఛార్జీలపై లావాదేవీకి రూ.1-2 చొప్పున ప్రాసెసింగ్‌ ఫీ వసూలు చేయనుంది.

రూ.50 లోపు ఫోన్‌ రీఛార్జీలపై రుసుములు ఉండవని, రూ.50-100 రీఛార్జీలపై రూ.1, రూ.100 దాటితే రూ.2ను ప్రయోగాత్మకంగా వసూలు చేయనున్నట్టు ఫోన్‌పే అధికార ప్రతినిధి వెల్లడించారు. రీఛార్జి లావాదేవీ యూపీఐ ద్వారా చేసినా ఈ బాదుడు తప్పదని పేర్కొంది. దీంతో యూపీఐ ఆధారిత లావాదేవీలపై సర్ ఛార్జీలు విధించిన మొదటి డిజిటల్‌ చెల్లింపుల సంస్థగా ఫోన్‌పే నిలవనుంది.

పోటీ సంస్థలు ఈ లావాదేవీలపై ఛార్జి వసూలు చేయడం లేదు. ఇప్పటివరకు క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఫోన్‌పేతో పాటు ఇతర సంస్థలు కూడా ప్రాసెసింగ్‌ ఫీజులు వసూలు చేస్తున్నాయి. థర్డ్‌ పార్టీ యాప్‌లలో అధిక లావాదేవీలను ఫోన్‌పే నిర్వహిస్తోంది. సెప్టెంబరులో 165 కోట్ల యూపీఐ లావాదేవీలను ఫోన్‌పే నిర్వహించి, ఈ విభాగంలో 40 శాతం వాటా పొందింది.

మునుపటి వ్యాసం