కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆగ్ర‌హం

గెల్లు శ్రీనివాస్ ను హుజూరాబాద్ ప్ర‌జ‌లు దీవించి, ఆశీర్వ‌దిస్తారు

హైద‌రాబాద్: కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈసీ కూడా రాజ్యాంగ ప‌రిధి దాటి ప్ర‌వ‌ర్తిస్తోందని ఆయన ధ్వ‌జ‌మెత్తారు. . టీఆ‌ర్‌‌ఎస్‌ పార్టీ అధ్య‌క్షు‌డిగా ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శే‌ఖ‌ర్‌‌రావు వరు‌సగా తొమ్మి‌దో‌సారి ఏక‌గ్రీ‌వంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెస‌ర్ శ్రీనివాస్ రెడ్డి ప్లీన‌రీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. అనంత‌రం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌కు అభివాదం చేశారు.

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ...భార‌త ఎన్నిక‌ల సంఘం రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌గా వ్య‌వ‌హ‌రించాలి. గౌర‌వాన్ని నిల‌బెట్టుకోవాలి. ఈ దేశంలో ఒక సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడిగా, బాధ్య‌త గ‌ల పార్టీ అద్య‌క్షుడిగా, ఒక ముఖ్య‌మంత్రిగా భార‌త‌ ఎన్నిక‌ల సంఘానికి ఒక స‌ల‌హా ఇస్తున్నాను. చిల్ల‌ర‌మ‌ల్ల‌ర ప్ర‌య‌త్నాలు మానుకోవాల‌ని హెచ్చ‌రిస్తున్నాను. కేసీఆర్ స‌భ పెట్టొద్దు ఇది ఏం క‌థ. ఇది ఒక ప‌ద్ధ‌తా? కొంద‌రు దిక్కుమాలిన రాజ‌కీయాలు చేస్తున్నారు. నాగార్జున సాగ‌ర్ స‌భ పెట్టొద్దంటూ హైకోర్టులో కేసులు వేశారు.

హుజూరాబాద్‌లో స‌భ నిర్వ‌హించొద్దంటూ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌న పార్టీ నాయ‌కులు చాలా మంది హుజూరాబాద్ పోరాటంలో ఉన్నారు. హుజూరాబాద్ ద‌ళితులు అదృష్ట‌వంతులు. ఈసీ ఏం చేసినా న‌వంబ‌ర్ 4 త‌ర్వాత ద‌ళిత‌బంధు అమ‌లు జ‌రిగి తీరుతోంది. న‌వంబ‌ర్ 4  వర‌కు ద‌ళిత బంధు అమ‌లును ఆప‌గ‌ల‌దు. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలిచి తీరుతాడు. గెల్లు శ్రీనివాస్ ను హుజూరాబాద్ ప్ర‌జ‌లు దీవించి, ఆశీర్వ‌దిస్తారు. రాష్ట్ర‌మంత‌టా ద‌ళిత బంధును అమ‌లు చేస్తాం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.