ద‌ళిత బంధు రాష్ట్ర ఆర్థిక పురోగ‌తికి తోడ్పాటు: సీఎం

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ పార్టీ కార్యాల‌యం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశం హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఘనంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి ఏకగ్రీవంగా తొమ్మిదో సారి తెరాస అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఏడేళ్లలో బ‌డ్జెట్ల ద్వారా మొత్తం రూ. 23 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు పెడుతామ‌న్నారు. ద‌ళిత బంధుతోనే ఆగిపోం.. ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌డుతామ‌న్నారు.

అట్ట‌డుగున ఉన్నందునే ద‌ళితుల‌కు మొద‌ట కార్య‌క్ర‌మం చేప‌ట్టామని తెలిపారు. ద‌ళిత‌బంధుపై పెట్టే పెట్టుబ‌డి వృథా కాదు. ద‌ళిత బంధు రాష్ట్ర ఆర్థిక పురోగ‌తికి తోడ్పాటునిస్తోందన్నారు. ఈ ప‌థ‌కం ద్వారా సంప‌ద సృష్టి జ‌రుగుతోంది. 75 ఏండ్ల కాంగ్రెస్ పాల‌న‌లో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచ‌న చేశారా? అని ప్ర‌శ్నించారు. 

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ పార్టీ కార్యాల‌యం
తెరాస పార్టీ ఆర్థిక‌ప‌రంగా కూడా శ‌క్తివ‌తంగా త‌యారైందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తమ పార్టీకి కూడా విరాళాలు స‌మ‌కూరాయన్నారు. రూ. 240 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల విరాళాలు ఉన్నాయి. చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన విరాళాల ద్వారా పార్టీ కార్య‌కలాపాలు కొన‌సాగుతున్నాయని పేర్కొన్నారు. 31 జిల్లాల్లో పార్టీ కార్యాల‌యాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ పార్టీ కార్యాల‌యం ఏర్పాటు చేసుకుంటామ‌ని కేసీఆర్ తెలిపారు.