అనువాద శిఖరం జలజం సత్యనారాయణ

జలజం స్మృతిలో

పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ విద్యావేత్త, కవి, మేధావి, రచయిత, సహృదయ శిఖామణి, విద్యాసంస్థల అధినేత, పత్రికా సంపాదకులు, సాహితీవేత్త, అనువాద 'శిఖరం', తెలంగాణ ఉద్యమనాయకులు జలజం సత్యనారాయణ (77) అకాలమరణం యావత్తు తెలుగు సాహిత్యానికి తీరనిలోటు. అటు విద్యారంగంలో, ఇటు సాహిత్యరంగంలో రెండుకాళ్ల పడవపై నడిచి జీవితాన్ని సంపూర్ణం చేసుకున్న ప్రజల మనిషి. తెలుగనువాదరంగంలో జలతారులా జాలువారిన అక్షరాక్షర శిఖామణి. సాహిత్యం, రాజకీయం, సామాజికం, విద్యారంగం వంటి దారులలో నడిచి తనదైన మార్గంలో పయనించారు.

పాలమూరు జిల్లా బాలానగర్ మండలం రంగారెడ్డిగూడకు చెందిన జలజం జడ్చర్ల, వనపర్తి, నిజామాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్ లలో ఉపాధ్యాయుడిగా, జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకుడిగా‌ విద్యార్థులకు దశాబ్దాలపాటు విద్యాబుద్ధులు నేర్పిన గురువు. అంతేకాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కూడా సేవలందించిన ఆచార్యులు. రాజనీతితత్వ శాస్త్రంలో ఎన్నో ప్రచురణలు చేసిన గొప్ప విద్యావేత్త. జలజం విద్యారంగంపై ఉన్న మమకారంతో నలభై ఏళ్ల క్రితం లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ మహబూబ్ నగర్‌, బోధి పబ్లిక్ స్కూల్ హైదరాబాద్ జిల్లాల్లో స్థాపించి అనేకమంది విద్యార్థులను వైద్యులుగా, ఇంజినీర్లుగా‌, సైనికాధికారులుగా, బ్యాంకు అధికారులుగా, ఉన్నత క్రీడాకారులుగా, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దారు. నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఉత్తమవిద్యను అందించారు. అనేక హిందీ, ఉర్దూ, ఆంగ్ల, చైనా భాషా గ్రంథాలను తెలుగులోకి అనువదించి తెలుగులో అనువాద సాహిత్యానికి ఒక బలమైన ముద్రను వేశారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న తెలంగాణ ఉద్యమనాయకుడు జలజం గారు. 

ప్రముఖ సాహితీవేత్త కాళోజీ నారాయణరావు, విప్లవ సంఘం నేత వరవరరావులకు దగ్గరి సన్నిహితుడు. వరవరరావు, జలజం ఇద్దరూ జడ్చర్ల జూనియర్ కళాశాలలో సహాధ్యాపకులు కావడం విశేషం. అభ్యుదయ భావాలతో, మానవీయ కవితాస్ఫూర్తితో కవితలను సేకరించి తన సంపాదకత్వంలో "మానవుడే మా సందేశం" అనే సంకలనానికి సంపాదకత్వం వహించారు. ఈ పుస్తకాన్ని జడ్చర్లలో ప్రత్యేకసభను ఏర్పాటు చేసి వరంగల్ నుంచి ఎర్రబస్సులో కాళోజీని రప్పించి ఆవిష్కరింపజేసిన ఘనుడు జలజం. వరవరరావు, కాళోజీలను పలుమార్లు ఉమ్మడి పాలమూరు జిల్లాకు రప్పించి అనేకనేక సదస్సులు, సమావేశాలలో పాల్గొనేటట్లు చేశారు. అంతేకాదు 1970 లలో మహబూబ్ నగర్ లో "న్యూ థింకర్స్ ఫోరమ్" అనే సంస్థను స్థాపించి హైదరాబాద్ నుంచి ప్రముఖులను తీసుకువచ్చి అనేక కార్యక్రమాలను నిర్వహించారు. మరోపక్క "ధ్వని" అనే సాహిత్య సాంస్కృతిక సంస్థను స్థాపించి వందలాది సాహిత్య, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.  

విశేషమేమంటే  తెలంగాణ కవులు, రచయితల కోసం లిటల్ స్కాలర్ స్కూల్ లోని కాళోజీ హాలులో ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. పాలమూరు జిల్లాలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్విఘ్నంగా, నిర్విరామంగా ఊపందుకుందుకున్నాయంటే జలజం కవులకు గొప్ప కానుకగా అందించిన కాళోజీ హాలు మహిమనే అని చెప్పక తప్పదు. అంతేకాదు ఏడాదికోసారి హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను పాలమూరు దాకా రప్పించిన ఘనాపాఠి. 2017 లో జలజం ఆధ్వర్యంలో వారం రోజులపాటు పాలమూరు పుస్తక ప్రదర్శనను నిర్వహించడం ఆయన జ్ఞానతృష్ణకు నిదర్శనం. ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదవాలని, పుస్తకజ్ఞానం అందరికీ అందాలని ఆయన పడిన తపనను చూస్తే అర్థమవుతుంది.

జలజం సత్యనారాయణ సాహితీవేత్తగా రాణించి నేటి తరానికి మార్గదర్శకుడిగా నిలిచారు. మొదట్లో ఆయన అభ్యుదయ కవిత్వాన్ని ఆవిష్కరించి "అనల" అనే కవితాసంపుటిని వెలువరించారు. యువరక్తం ఉరకలు వేస్తున్న సందర్భంలో "అనల" తెలుగు సాహిత్యాన్ని అగ్గి రాజేసింది. ప్రగతిశీల భావాలతో పదంపదం సమాజాన్ని చైతన్యపరిచింది. ఉడుకుతున్న రక్తంతో రాసిన కవిత్వమది. ఇప్పటికీ "అనల" నేటి సమకాలీన సమాజానికి అద్దం పడుతుంది. తర్వాత ప్రముఖ హిందీ రచయిత జయశంకర ప్రసాద్ హిందీలో రచించిన "ఆంసు" కవితా సంపుటిని తెలుగులో ''వేదన'' పేరుతో అనువదించారు. "మానవుడే మా సందేశం'' అనే ప్రసిద్ధ కవితా సంకలనానికి ఆయన సంపాదకత్వం వహించారు.

మాజీ ప్రధానమంత్రి, సాహిత్యవేత్త, రాజకీయ మేరునగధీరుడు‌, రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్ పేయి హిందీ భాషలో రచించిన అనేక కవితలను "శిఖరం" పేరుతో తెలుగులోకి అనువదించి వాజ్ పేయి కవితలకు ప్రాణప్రతిష్ట చేశారు. వాజ్ పేయి అంతరంగ సంవేదనలను, అనంత ఆవేదనలను ''శిఖరం''గా మలిచినతీరు జలజం అనువాద తీరుకు నిదర్శనం. తెలుగు సాహిత్యంలో వాజపేయి మీద వెలువరించిన అనువాద గ్రంథం ఇదొక్కటే కావడం విశేషం. ప్రసిద్ధ ఆధ్యాత్మికయోగి, చింతనాపరులు కబీరు దాస్ హిందీలో రాసిన దోహాలను "కబీర్ గీత" గా చాలా సరళసుందరంగా అనుసృజన చేశారు. కబీరు దోహాలను ఇతర ప్రపంచ భాషల్లోకి ఎవరెవరు అనువదించారో వారందరి రచనలను కూడా సేకరించి తనదైన శైలిలో అందరికీ సులభతరంగా అర్థమయ్యేలా "కబీరు గీత" ను తెలుగు పాఠకులకు అందించిన మేధావి జలజం.

హిందీభాషలో జలజం నిష్ణాతుడు కావడంతో కబీరు గురించి రాసిన ఇతర భాషా అనువాదాలెన్నింటినో అధ్యయనం చేసి తన అనువాదానికి శ్రీకారం చుట్టారు. కబీరు దాస్ ను, అతని దోహాలను సంపూర్ణంగా అర్థం చేసుకుని అనువాదం చేయడం జలజం అనువాద సృజనాత్మకతకు వెన్నతో పెట్టిన విద్య. కబీరు దోహాలకు ప్రాణం పోసి తెలుగుభాషలోకి అనువదించి సొంత రచనలా అన్నట్లు తెలుగు సాహిత్యానికి అందించిన జలజం అనువాద శిఖరం. దోహా అంటే రెండు పాదాలు. కానీ తెలుగులో జలజం నాలుగు పాదాలుగా ఆవిష్కరించి పాఠకులకు మధుసేవనం చేయించారు.

సూఫీ తత్వాన్ని లోకానికందించిన కబీరు సాహిత్యాన్ని జలజం చక్కటి మధురమైన వచన కవితలుగా ఆవిష్కరించిన తీరు ప్రశంసార్హమైనదనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. భాషాపటిమతో, పదాలపై ఉన్న పట్టుతో, అక్షరప్రవాహంతో, భావాత్మకతతో అనువాదరంగానికి అక్షరాభిషేకం చేసిన సుకుమార రచయిత. జీవన తాత్వికతను, జీవితగాఢతను వెన్నముద్దలుగా అందించిన జలజం నిజంగా తెలుగు సాహిత్యంలో వెలిగే నిత్య ధృవతార. హిందీభాషలో పదాల మీద, శబ్ధసౌందర్యం మీద తగిన పట్టు ఉండడంతో సులభంగా అనువాదం చేయగలిగారు.

బిల్హణుడు సంస్కృతంలో రాసిన శృంగార బిల్హణీయాన్ని "శృంగార బిల్హణీయం" గా అదే పేరుతో తెలుగులోకి తర్జుమా చేశారు. ఈ విధంగా వివిధ భాషలలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖుల రచనలను తెలుగులోకి అనువాదం చేసి తన అనువాద పటిమను చాటుకున్నారు. ప్రసిద్ధ ఉర్దూకవులు ఫైజ్ అహ్మద్ ఫైజ్ రచించిన కవితలను "ఫైజ్ కవిత్వం" పేరుతో, హాఫెజ్ రచించిన కవితలను "ప్రేమలహరి" పేరుతో తర్జుమా చేశారు. మూలం ఏమాత్రం దెబ్బతినకుండా తెలుగులో అనుసృజనకు ప్రాణం పోసిన అనువాదక శిఖామణి. ఇటీవల తెలుగు సాహిత్యంలో ఎవరూ చేయనంత అనువాదాలు ఒక్క చేతితోనే సత్యనారాయణ గారు చేయడం గొప్ప సాహిత్య కృషికి నిదర్శనం.

ఇంకా ఇతర ప్రపంచభాషలలో ఉన్న సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించి తెలుగు సాహిత్యానికి పరిచయం చేశారు. బహుభాషా పాండిత్యంతో అలరాడిన జలజం తెలుగు సాహిత్యంలో పూసిన జలతారు పుష్పం. అలాగే కొన్ని సంవత్సరాల పాటు సృజన, ధ్వని మాసపత్రికలను కూడా తన సంపాదకత్వంలో వెలువరించిన పత్రికా సంపాదకుడు. తన సాహిత్య కృషికి దర్పణంగా అనేక పురస్కారాలను ఆయన అందుకున్నారు. 2016 లో పాలమూరు సాహితి జీవన సాఫల్య పురస్కారం, కట్టోజు విజయభాస్కరాచారి విద్యారంగ పురస్కారం, 2019 లో తెలంగాణ సారస్వత పరిషత్తు వారి ఆలూరి బైరాగి పురస్కారం వంటి పురస్కారాలెన్నో ఆయన్ని వరించాయి. 

మొదట్లో రాజకీయ నాయకులకు మార్గదర్శిగా, సలహాదారుడిగా ఉంటూ వారి భవిష్యత్తుకు రాచబాట వేసిన రాజనీతిజ్ఞుడు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, మాజీ మంత్రి మహేంద్రనాథ్, మాజీ గవర్నర్ బీ.సత్యనారాయణ రెడ్డిలతో పాటు అనేక కేంద్ర, రాష్ట్రమంత్రులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న మేధావి.

ప్రముఖ సినీనటుడు ఎన్టీ రామారావు 1983 లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు స్వయంగా జలజం సత్యనారాయణను హైదరాబాద్ కు రప్పించి మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా పోటీ చేయమని కోరారు. అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోనూ క్రియాశీలకంగా పనిచేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు అప్పట్లో కేసీఆర్ ఏర్పాటు చేసిన 42 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులలో జలజం సత్యనారాయణ ఒకరు. అనంతరం తెలంగాణ ఉద్యమ కాలంలో స్థాపించబడిన eతెలంగాణ వెబ్సైట్ కు మార్గనిర్దేశం చేశారు. సుదీర్ఘకాలంగా నిర్వీరామ రచనలు చేస్తూ సాహిత్య, అనువాద రచనలు భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషి చేశారు. 

అనువాదమనే సాలెగూడు అల్లికను అత్యంత సుందరంగా అల్లి అనువాద సొగసును తెలుగు సాహిత్యానికి అందించిన గొప్ప సాహిత్యవేత్త. మూలంలోని నుడికారం ఏమాత్రం దెబ్బతినకుండా అనువాదమా లేక స్వతంత్ర రచననా అన్నట్లు జలజం అనువాదాన్ని అనుసృజించారు. అనువాదకుడు స్వతాహాగా కవి, రచయిత కావడం వల్ల జలజం అనువాద రచనలు పరిపుష్టమైనవనే చెప్పవచ్చు. చాలా సరళసుందరంగా జలజం అనువాదసొగసును అతని రచనల్లో మనం గమనించవచ్చు. స్వీయరచన అన్నంతగా అలవోకగా చదివింపజేశారు. భావుకత నిండిన పదాలతో, లలితమైన భాషలో జలజం అనువాదం అందరినీ ఆకట్టుకుంటుంది. తెలుగు పలుకుబడులను చక్కగా ఉపయోగించి అనువాదంలో కూడా మన భాషా సౌందర్యాన్ని వెలిగించినవారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక సాహిత్య, సాంస్కృతిక సంస్థలకు ప్రాణంపోసి ఎందరెందరో కవులను, రచయితలను వెలుగులోకి తెచ్చిన గొప్ప సాహితీవేత్త. అంతేకాదు తెలంగాణ ఉద్యమకారుడిగాను తనదైన విశిష్టపాత్రను పోషించారు. అనేక విద్యా సంస్థలను నెలకొల్పి గ్రామీణ, పట్టణ విద్యార్థినీ, విద్యార్థులకు సేవలందించిన ఆదర్శమూర్తి జలజం. తను నమ్మిన సిద్ధాంతాలకే పరిమితమై నిర్దిష్టమైన సామాజిక లక్ష్యాలతో కృషి చేసిన ఆచరణవాది. ఏమాత్రం ప్రచార ఆర్భాటాలకు లోనుకాకుండా ఉండే సాహితీవేత్త. ఎప్పుడూ సమాజ చింతనతో, ప్రణాళికాబద్ధంగా విలువైన పనులు చేసుకుంటూ పోయే క్రమశిక్షణ జలజం జీవలక్షణం. అలాంటి అరుదైన మూర్తిమత్వం జలజం సొంతం. జలజం అంటే ఒక సాహితీ పారిజాతం. జలజం అంటే ఒక విద్యాగంధం. జలజం అంటే ఒక సమున్నత అనువాద శిఖరం.

(డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ఫోన్: 9032844017)