చెయ్యేరు లో వరద బీభత్సం.. 30 మంది గల్లంతు

భారీ వర్షాలతో నీట మునిగిన తిరుపతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్థంభించింది. చెయ్యేరు నది నుంచి నందలూరు, రాజంపేట తదితర ప్రాంతాల్లో వరద పోటెత్తింది. దీంతో నందలూరు పరీవాహక ప్రాంతంలోని మండపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో చెయ్యేరు వరదలో సుమారు 30 మంది కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు గాలింపు చేపట్టి మూడు మృతదేహాలను వెలికి తీశారు.

వానలు, వరదల పరిస్థితిపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ముంపు బాధితులకు రూ.2 వేల తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. గండి పడిన చెరువులకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. తిరుపతిలో భారీగా వరద నీరు నిల్వడానికి గల కారణాలను విశ్లేషించాలని సూచించారు.

జబ్బులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే తిరుపతి నీట మునిగింది. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ముంపు ప్రభావం ఎక్కువగా ఉంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో నది పరివాహక ప్రాంతంలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. గుండ్లూరు, శేషమాంబాపురం, మందపల్లి గ్రామాలు మునిగాయి.

మునుపటి వ్యాసం