మహాధర్నాకు రాకేశ్ టికాయత్ రాక

నేడు ఇందిరాపార్క్ వద్ద రైతు సంఘాల ధర్నా

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత ఏడాది కాలంగా రైతులు ఉద్యమం చేపడుతున్నారు. ఈ మేరకు రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు. కాగా, రైతుల ఉద్యమానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా మహాధర్నా నిర్వహిస్తున్నారు. నేడు ఇందిరాపార్క్ వద్ద రైతు సంఘాల మహాధర్నా చేపట్టనున్నారు.

ఆలిండియా రైతు పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు రైతు సంఘాలు వెల్లడించాయి. సాగుచట్టాలు రద్దును పార్లమెంట్ లో ఆమోదించాలని, అదే విధంగా విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేసి ఆమోదించాలని  డిమాండ్ చేస్తున్నారు. ధర్నాలో కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్ టికాయత్ పాల్గొననున్నారు. మహాధర్నాలో వివిధ రైతు సంఘాల నేతలు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కిసాన్ నేతల మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు నేతలు వెల్లడించారు.  

ఇదిలా ఉండగా, మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసే ముసాయిదా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, 2021కు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ నెల 29 నుంచి జరుగనున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెడతారు. ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదిస్తే గత ఏడాది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు చట్టపరంగా రద్దవుతాయి. 

మునుపటి వ్యాసం