విజయవాడలో తిరుగుతున్న చెడ్డీ గ్యాంగ్

చిట్టీనగర్‌లో చోరి.. నగదు, బంగారం అపహరణ

విజయవాడ: విజయవాడ నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ చొరబడి సోమవారం దొంగతనానికి పాల్పడింది. చిట్టీనగర్‌లోని చెనుమొలు వెంకట్రావు ఫ్లైఓవర్ వద్ద ఉన్న శివదుర్గ అపార్ట్‌మెంట్లోకి ప్రవేశించి నగదు, బంగారాన్ని దోచుకెళ్లింది. ఫ్లాట్ నెంబర్ G 18లో మొదటి ఈ అంతస్థులో సోమవారం ఉదయం తెల్లవారు జామున 3:15 గంటల సమయంలో ఈ చోరీ జరిగింది. దొంగతనంపై చిట్టీనగర్‌ పోలీస్ స్టేషన్లో అపార్ట్‌మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

అటవీ ప్రాంతాల్లో ఉండే చెడ్డీ గ్యాంగ్ తెగ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోని అడవుల్లో నివసించే పలు తెగలను చెడ్డీ గ్యాంగ్ అని, కచ్చా బనియన్ గ్యాంగ్ అని కూడా పిలుస్తుంటారు. ఒక్కో ముఠాలో పది నుంచి 15 మంది వరకు ఉంటారని, ఇలాంటి ముఠాలు వందల సంఖ్యలోనే ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్‌లు బనియన్లు, చెడ్డీలు ధరించి చేతిలో రాడ్లతో దొంగతనాలు చేస్తుంటారు. 

ఒక్కో నగరానికి కొన్ని ముఠాలు వెళ్తాయి. వీరు ఎక్కువగా రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. నగరాలకు చేరుకున్న తర్వాత ఆ ప్రాంతంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల సమీపంలో లేదా ఖాళీ స్థలాల్లో గుడారాలు వేసుకుని తాత్కాలిక నివాసం ఉంటారు. పగలు బిచ్చగాళ్లుగా లేదంటే ఇంటింటికి తిరిగి బొమ్మలు, దుప్పట్లు విక్రయిస్తుంటారు.

ఇలా తిరుగుతూ సంపన్నుల ఇళ్లను గుర్తించి సమాచారం ఇస్తే గ్యాంగ్‌లోని పురుషులు దోపిడీలకు పాల్పడతారు. గతంలో హైదరాబాద్ నగరంలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతూ కలకలం సృష్టించింది. హైదరాబాద్ శివార్లలోని నాగారం, చైతన్యపురి తదితర ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు రాచకొండ పోలీసులు నిర్ధారించారు.

మునుపటి వ్యాసం