సినిమా టికెట్ల ధరల తగ్గించం: మంత్రి తలసాని

థియేటర్లపై ఆంక్షలు పెడుతారన్నది కేవలం అపోహ అని మంత్రి వెల్లడి

హైదరాబాద్‌: తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు తగ్గించమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ఒమిక్రాన్‌ నేపథ్యంలో థియేటర్లపై ఆంక్షలు విధిస్తారన్న ప్రచారం నేపథ్యంలో మంత్రితో నిర్మాతలు, దర్శకులు భేటీ అయ్యారు. భేటీ అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. కరోనా దృష్ట్యా థియేటర్లపై ఆంక్షలు పెడుతారన్నది కేవలం అపోహ మాత్రమేనన్నారు.

కరోనా వల్ల రెండేళ్లుగా సినీ పరిశ్రమకు ఇబ్బందులున్నాయని, ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో ఒమిక్రాన్‌ వస్తోందన్నారు. సినీ పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడ్డాయని, సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సినిమా టికెట్ల ధరల సవరణ నిమిషాల్లో జరిగే పనికాదన్నారు. తగ్గించే ఆలోచన లేదన్నారు.

ఏ వైరస్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో దానయ్య, రాజమౌళి, దిల్‌రాజు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ హాజరయ్యారు.