ఈనెల 8న రైతుల స‌మ‌స్య‌ల‌పై పోరాటం: చంద్రబాబు

ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌పై నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు

అమరావతి: రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఎవ్వ‌రినీ వ‌దిలి పెట్ట‌కుండా వేధిస్తోంద‌ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన వైఎస్సార్ పార్టీపై మండి పడ్డారు. బాధితుల త‌ర‌ఫున త‌మ పార్టీ పోరాడుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. బుధవారం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ...ఈ నెల 18న టీడీపీ స‌భ్య న‌మోదు కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని చెప్పారు.

టీడీపీకి ఈ ఏడాది చాలా ముఖ్య‌మ‌ని ఆయ‌న తెలిపారు. పార్టీ త‌ర‌ఫున‌ ఏం చేసినా ఈ ఏడాదే చేయాల‌ని అన్నారు. వ‌చ్చే ఏడాది ఎన్టీఆర్ జ‌న్మించి వందేళ్లు అవుతుంద‌ని చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పార్టీ కార్య‌క‌ర్త‌లు ముంద‌కు వెళ్లాల‌ని సూచించారు. ఎన్టీఆర్ జ‌యంతి ఉత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. వివిధ వ‌ర్గాల‌ను క‌లుపుకుని ముందుకు వెళ్లాల‌ని చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌పై నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పార్టీ నేతలకు  పిలుపునిచ్చారు.

స్థానికంగా వైసీపీ నేత‌లు పాల్ప‌డుతోన్న మోసాలను ఎండ‌గ‌ట్టాల‌ని అన్నారు. వైసీపీ నేత‌లు చేస్తోన్న త‌ప్పుల‌ను ప్ర‌జ‌ల‌ను వివ‌రించి చెప్పాల‌ని తెలిపారు. టీడీపీ త‌ర‌ఫున నియోజ‌క వ‌ర్గాల్లో నిర‌స‌న‌లు తెల‌పాల‌ని పిలుపునిచ్చారు. మ‌హానాడు నిర్వ‌హించే వ‌ర‌కు వ‌రుస కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని పార్టీ నేతలకు, కార్యకర్తలకు సూచించారు. ఇందుకోసం కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించామ‌ని తెలిపారు. ఈ నెల 8న రైతుల స‌మ‌స్య‌ల‌పై పోరాటం జ‌ర‌పాల‌ని ఆయ‌న సూచించారు. 

మునుపటి వ్యాసం