సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక కథనం

సంక్రాంతి పండుగకు ఒక రోజు ముందు వచ్చే పండుగే భోగి

ప్రతి ఏడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే పట్టణాల నుంచి పల్లెల వరకు ఆనందోత్సహాల మధ్య వేడుకను జరుపుకుంటారు. శీతాకాల పరవళ్లతో పచ్చని పొలాలు, పండ్లు, కూరగాయలతో ప్రకృతి..ధనధాన్యాభివృద్ధితో ప్రతి ఇళ్లు కళకళలాడుతుంటుంది. పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లిన ప్రతి ఒక్కరు సంక్రాంతి పండుగకు సొంత గూటికి చేరుకుని ఆనంద విహారాల్లో కుటుంబ సమేతంగా గడుపుతుంటారు. ఇంతటి విశిష్టత కలిగిన సంక్రాంతి పండుగకు ఒక రోజు ముందు వచ్చే పండుగే భోగి. 

భోగిని భోగభాగ్యాలు ఇచ్చే పర్వదినంగా మన సాంప్రదాయం చెబుతుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారు జామునే లేచి తలస్నానమాచరించి  సూర్యోదయానికి ముందే భోగి మంటలను దర్శించుకుంటారు. చలిని దూరం చేస్తూ, కొత్త వాటితో నిత్యనూతన జీవితం ప్రారంభించడానికి ఓ గుర్తుగా భోగి మంటలను వెలిగిస్తారు. ఇదే రోజున ఇంట్లో పాత సామాన్లు తీసేసి సంక్రాంతి రోజు కొత్త సామాన్లు తెచ్చుకుంటారు. నూతన వస్తువులు కొత్తదనానికి, ఆనందానికి, అభ్యుదయానికి చిహ్నంగా ఈ పండుగను భావిస్తారు. 

ఈ రోజు తెల్లవారు జామునే స్నానమాచరించి నూతన దుస్తులు ధరిస్తారు. అనంతరం ఇష్టదైవాన్ని స్మరించుకుని భోగి మంటలను దర్శించుకుంటారు. రేగు పండ్లు సూర్యుడికి ప్రీతిపాత్రమైనవి కావున వీటిని సూర్యాస్త సమయంలో పిల్లల తల మీద నుంచి పోయడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం కలిగి ఆరోగ్యం కలుగుతుందని, వారికి ఉన్న నరదృష్టి తొలగి, మంచి జరుగుతుందని శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. అందువల్లనే ఆ రోజు సాయంత్రం పిల్లలకు భోగిపండ్లు పోస్తారు. ఇష్టమైన తినుబండారాలు చేసుకుని కుటుంబసమేతంగా ఆరగిస్తారు. 

సంక్రాంతి:
సంక్రాంతి సం అంటే మిక్కిలి. క్రాంతి అంటే అభ్యుదయం. సంక్రాంతి అంటే మంచి వృద్ధిని ఇచ్చేటువంటి రోజు అని అర్థం. నేడు సంవత్సర కాలపరిమితిలో సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించడాన్ని సంక్రమణమనీ, సంక్రాంతి అని అంటారు. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పండుగ చేసుకుంటాం.

మకర సంక్రాంతి నాటి సూర్యశక్తికి సంక్రాంతి పురుషుడు అని పేరు. ఈ సంక్రాంతి పురుషుడి పేరు, రూపం, వాహనం, ధరించిన ఆయుధాలను అనుసరించి ఫలితాలు నిర్దేశిస్తుంటారు. ఈ సారి సంక్రాంతి పురుషుడి పేరు మంద. వాహనం సింహం.తెల్లని దుస్తువులు, తెల్లని ఛత్రం, పున్నాగ పూలు, నానావిధ ఆభరణాలు, వీణ, యవాక్షతలు, సువర్ణ పాత్ర ధరించి ప్రవేశిస్తున్నాడు.

ఈ సంక్రాంతి పురుషుడు మిశ్రమ ఫలితాలివ్వనున్నాడు. మకర సంక్రాంతి రోజు వంశాభివృద్ధి కోసం పితృదేవతలకు తర్పణాలు, శక్తి కొద్ది దానాలు చేయాలి. జంట సన్నాయి మేళం జోడు బసవన్నల తాళం మీ ఇంట నింపాలి ఆనంద కోలాహలం అని కోరుకుంటూ ..పాఠకులకు సంక్రాంతి శుభాకాంక్షలు


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం