పాక్లో దొంగల ప్రభుత్వం నడుస్తోంది: మాజీ ప్రధాని ఇమ్రాన్
న్యాయవ్యవస్థను కూడా భ్రష్ఠు పట్టిస్తున్నారని ఇమ్రాన్ వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాక్లో దొంగల ప్రభుత్వం నడుస్తోందని, ఇటువంటి ప్రభుత్వాన్ని కొనసాగించే బదులు ఆటంబాంబ్ వేసేస్తే సరిపోతుందంటూ.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విరుచుకుపడ్డారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో రెచ్చిపోతున్న దొంగలను చూసి నేను షాక్ అవుతున్నానని అన్నారు.
చివరకు న్యాయవ్యవస్థను కూడా భ్రష్ఠు పట్టిస్తున్నారని ఇమ్రాన్ విమర్శించారు. వీరు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పాక్లో వ్యవస్థలన్నీ భ్రష్టమైపోతున్నాయని ఇమ్రాన్ ప్రస్థుత ప్రభుత్వాన్ని ఉద్ధేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ నేరస్థులపై ఏ ప్రభుత్వ అధికారి విచారణ చేపడతారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రభుత్వ పెద్దల నుంచి తనకు ఎన్నో ఫోన్లు వచ్చాయని, కానీ వాటికి సమాధానం చెప్పలేదని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించే వరకూ తాను ఎవ్వరితోనూ మాట్లాడనని ఇమ్రాన్ స్పష్టం చేశారు.