నియంతృత్వ పాలన చేస్తున్న దుర్మార్గుడు మోదీ: ఎమ్మెల్యే సుమన్‌

నియంతృత్వ పాలన చేస్తున్న దుర్మార్గుడు మోదీ: ఎమ్మెల్యే సుమన్‌

హైదరాబాద్‌: నియంతృత్వ పాలన చేస్తున్న దుర్మార్గుడు మోదీ అని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ (MLA Balka suman) అన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి అసమర్ధ ప్రధానిని ఎన్నడూ చూడలేదని చెప్పారు. కరోనా సమయంలో అసమర్ధ పాలనను ప్రపంచమంతా చూసిందని విమర్శించారు. అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు జీవన్‌ రెడ్డి, కోరుకంటి చందర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ సంపదను అదానీ, అంబానీకి దోచిపెడుతున్నారని ఆరోపించారు. మోదీ పనిచేస్తున్న దేశం కోసమా లేదా.. దోస్తుల కోసమా అని ప్రశ్నించారు.

కుటుంబ పార్టీలపై మాట్లాడే నైతికత బీజేపీకి లేదన్నారు. ఆ పార్టీలో ఒకే కుటుంబానికి చెందినవాళ్లు చాలా మంది ఉన్నారని గుర్తుచేశారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ప్రజల చేత నేరుగా ఎన్నికయ్యారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ కుటుంబం త్యాగాలు చేసిందన్నారు. అమిత్‌షా కుటుంబం క్రికెట్‌ బోర్డును నియంత్రణలో పెట్టుకున్నదని విమర్శించారు. ఇలాంటి వాళ్లు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణకు పచ్చి వ్యతిరేకి..

ప్రధాని మోదీ పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని సుమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వినతులపై మోదీ ఎన్నడూ సానుకూలంగా స్పందించలేదన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని చెప్పారు. రాష్ట్రం ఉనికిలోకి రాకముందే తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని, ఐటీఐఆర్‌ను రద్దుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అరిగోస పెడుతున్నది కేంద్రం కాదా అని ప్రశ్నించారు.

కేంద్రం ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో సమాధానం చెప్పాలని సుమన్‌ డిమాండ్‌ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలిచ్చారని ప్రశ్నించారు. కేంద్రంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.

courtesy:https://www.ntnews.com/news/mla-balka-suman-says-pm-modi-ruled-as-dictator-602125


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox