- నేడు రాజస్థాన్‌తో బెంగళూరు ఢీ l ఐపీఎల్ క్వాలిఫయర్-2
ఎలిమినేటర్ విజయంతో జోష్‌లో ఉన్న జట్టు ఓ వైపు.. క్వాలిఫయర్ ఓటమితో ఒత్తిడిలో కనిపిస్తున్న టీమ్ మరో వైపు.. బ్యాటింగే ప్రధాన బలంగా బరిలోకి దిగనుంది ఒకరైతే.. అన్నీ విభాగాల్లో సమతూకంగా సిద్ధమవుతున్నది మరకొరు.. ఐపీఎల్-15వ సీజన్లో సెమీఫైనల్ వంటి పోరుకు రంగం సిద్ధమైంది.లీగ్ ఆరంభ సీజన్లో విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని బెంగళూరుతో తలపడనుంది. అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న ఈ పోరులో గెలిచిన జట్టు.. ఆదివారం జరుగనున్న మెగావార్లో టైటిల్ కోసం గుజరాత్‌తో కొట్లాడనుంది!
అహ్మదాబాద్: తమ చిరకాల కల నెరవేర్చుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రెండడుగుల దూరంలో నిలిచింది. ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసిన బెంగళూరు.. శుక్రవారం క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గత మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడి రాజస్థాన్ కాస్త డీలా పడితే.. లక్నోపై ఘన విజయంతో బెంగళూరు జోరుమీదుంది. ఇతర జట్ల గెలుపోటములతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన బెంగళూరు.. ఎలిమినేటర్‌లో సమిష్టిగా సత్తాచాటింది. కెప్టెన్ డుప్లెసిస్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ విఫలమైన వేళ.. అనామక ఆటగాడు రజత్ పాటిదార్ విధ్వంసం సృష్టించాడు.
లక్నో బౌలర్లను చీల్చి చెండాడుతూ ఫోర్లు సిక్సర్లతో ఈడెన్ గార్డెన్స్‌లో అజేయ శతకంతో విశ్వరూపం కనబర్చాడు. అతడి దూకుడుకు దినేశ్ కార్తీక్ మెరుపులు తోడవడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేయగలిగింది. గత మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన విరాట్, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ కూడా స్థాయికి తగ్గ ఆట తీరు కనబరిస్తే బెంగళూరుకు తిరుగుండదు. మరోవైపు టాపార్డర్ బలంతో నిలకడగా విజయాలు సాధిస్తూ.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు చేరిన రాజస్థాన్.. గత మ్యాచ్‌లో మంచి స్కోరే చేసినా.. గుజరాత్ హిట్టర్లను అడ్డుకోవడంలో విఫలమై మూల్యం చెల్లించుకుంది. జోస్ బట్లర్, సంజూ శాంసన్ మంచి టచ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసి రానుండగా.. బౌలింగ్‌లో రాజస్థాన్ కంటే బెంగళూరే మెరుగ్గా కనిపిస్తున్నది.
హ్యాట్సాఫ్ ‘హా’స్టార్స్..
బెంగళూరు జట్టు క్వాలిఫయర్-2 వరకు వచ్చిందంటే.. ‘హా’త్రయం నిలకడే అందుకు కారణమని చెప్పాలి! ప్రస్తుత సీజన్ డెత్ ఓవర్స్‌లో అత్యంత ప్రమాదకర బంతులు వేస్తూ.. ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న హర్షల్ పటేల్‌తో పాటు హజిల్‌వుడ్, హసరంగ రాణిస్తుండటంతో బౌలింగ్‌లో బెంగళూరుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. గత మ్యాచ్‌నే పరిశీలిస్తే.. ఇతర బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న చోట హర్షల్ 4 ఓవర్లలో 25 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అందులోనూ మ్యాచ్‌లో అత్యంత కీలకమైన 18వ, 20వ ఓవర్లు బౌలింగ్ చేయడం గమనార్హం. ఇక 19వ ఓవర్లో చక్కటి యార్కర్లతో ఆకట్టుకున్న హజిల్‌వుడ్.. కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాను ఔట్ చేసి.. జట్టు విజయానికి బాటలు వేశాడు.
ఇక మిడిల్ ఓవర్లలో హసరంగా తన స్పిన్‌తో బ్యాటర్లను భారీ షాట్లు ఆడకుండా కట్టి పడేస్తున్నాడు. రాజస్థాన్ జట్టులో రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నా.. వీరిద్దరు గుజరాత్‌తో మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. క్వాలిఫయర్-1లో ఈ జోడీ 8 ఓవర్లు వేసి ఒక్క వికెట్ పడగొట్టకుండా 72 పరుగులు సమర్పించుకుంది. మిడిల్ ఓవర్లలో ఒత్తిడి పెంచాల్సిన చోట స్వేచ్ఛగా ఆడనివ్వడంతో హార్దిక్ సేన ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ తప్పులు సరిదిద్దుకొని రాయల్స్ బలంగా పుంజుకోవాలని భావిస్తుంటే.. రాజస్థాన్‌ను ఓడించి ఫైనల్ చేరాలని బెంగళూరు కృత నిశ్చయంతో ఉంది. మరి ఎవరి కల ఫలిస్తుందో చూడాలి!
తుది జట్లు (అంచనా)
బెంగళూరు: డుప్లెసిస్ (కెప్టెన్), కోహ్లీ, పాటిదార్, మ్యాక్స్‌వెల్, లోమ్రర్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హర్షల్, హసరంగ, హజిల్‌వుడ్, సిరాజ్.రాజస్థాన్: శాంసన్ (కెప్టెన్), బట్లర్, జైస్వాల్, పడిక్కల్, హెట్‌మైర్, పరాగ్, అశ్విన్, బౌల్ట్, చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, మెక్కాయ్.
courtesy:https://www.ntnews.com/news/ipl-2022-qualifier-2-rajasthan-royals-vs-royal-challengers-bangalore-601779

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox