TSRTC Offer: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. ఇక టిక్కెట్​ బుకింగ్​ కష్టాలకు చెక్​.. వివరాలివే

తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ప్రయాణికులకు తన సేవలను మరింత విస్తరిస్తుందే తప్పా.. ఏ మాత్రం తగ్గించడం లేదు. కొత్త కొత్త ఆఫర్లు, స్కీంలతో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం సైతం చేస్తోంది.

లాభ నష్టాల మాట ఎలా ఉన్నా.. తెలంగాణ ఆర్టీసీ (TSRTC) మాత్రం ప్రయాణికులకు తన సేవలను మరింత విస్తరిస్తుందే తప్పా.. ఏ మాత్రం తగ్గించడం లేదు. కొత్త కొత్త ఆఫర్లు, స్కీంలతో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం సైతం చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. లాభాలను పెంచుకోవడం కోసం కార్గో సేవలను సైతం తక్కువ ధరకే ఆర్టీసీ అందిస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆర్టీసీలో అనేక మార్పులు వచ్చాయి. సంస్థను లాభాల బాటలో నడిపించడమే కాకుండా.. ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు సజ్జనార్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయాణికులకు (Passengers) మరింత మెరుగైన సేవలే లక్ష్యంగా టీఎస్‌ఆర్టీసీ (TSRTC) దేశంలోనే తొలిసారిగా బస్సుల్లో ఐ-టిమ్స్‌ (ఇంటెలిజెంట్‌ టిక్కెట్‌ ఇష్యూ మిషన్‌) అతి త్వరలోనే ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం 928 ఐ-టిమ్స్‌ యంత్రాలను కొనుగోలు చేసినట్టు ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ (Sajjanar) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఐ-టిమ్స్‌  (I-Tims) యంత్రాలను తొలివిడతలో దూరప్రాంతాల బస్సుల్లో ప్రవేశపెట్టనున్నట్టు వారు పేర్కొన్నారు. ప్రస్తుతం దూర ప్రాంత సర్వీస్‌లకు బస్సు (Bus)  బయలుదేరేందుకు గంట ముందే ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ (Online reservation) నిలిపివేస్తున్నారు. ఐ-టిమ్స్‌ (I-Tims)తో ఇక ఆ ఇబ్బంది ఉండదని వారు తెలిపారు.

ఆన్‌లైన్‌లో 15 నిమిషాల ముందు..

బస్సు మొదటి స్టేజీ (First stage) నుంచి ప్రారంభమైన తర్వాత కూడా ఆ మార్గంలోని తర్వాతి స్టాప్‌లలో బస్సు ఎక్కదల్చుకున్న ప్రయాణికులు ఆన్‌లైన్‌లో 15 నిమిషాల ముందు వరకు కూడా బస్సులో సీట్ల అందుబాటును బట్టి రిజర్వేషన్‌ చేసుకోవచ్చని వెల్లడించారు. ప్రయాణికులకు ఎంత సమయంలో బస్సు వారి స్టాప్‌ వద్దకు వస్తుందన్న సమాచారం సైతం ఐ-టిమ్స్‌ ద్వారా తెలుసుకోవచ్చునని, అన్నింటికి మించి ప్రయాణికులు తమ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో ఈ ఐ-టిమ్స్‌ లో చార్జీలు చెల్లించవచ్చని తెలిపారు.

స్వైపింగ్‌ మిషన్‌లా..

ఇది స్వైపింగ్‌ మిషన్‌లా కూడా పనిచేస్తుంది. అదేవిధంగా త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు స్మార్ట్‌కార్డులను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్టు వారు పేర్కొన్నారు. రివార్డు పాయింట్ల వ్యవస్థను అమలు చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు ఆర్టీసీ అధికారులు.

రాత్రి కూడా ఆర్టీసీ బస్సులు..

ఇటీవలె హైదరాబాద్ వాసులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సాధారణంగా రాత్రి 10, 11 గంటల వరకు మాత్రమే సిటీ బస్సులు హైదరాబాద్ రోడ్లపై కనిపిస్తాయి. అనంతరం ఉదయం ఆయా ప్రాంతాలను బట్టి ఉదయం 4, 5 గంటలకు తిరిగి తమ సేవలను ప్రారంభిస్తాయి ఆర్టీసీ బస్సులు. అయితే గ్రేటర్ పరిధిలో రాత్రంతా బస్సులను నడిపేందుకు సిద్ధమైంది ఆర్టీసీ. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్-పటాన్ చెరు, పటాన్ చెరు-సికింద్రాబాద్, సికింద్రాబాద్-చార్మినార్, చార్మినార్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-సీబీఎస్, సీబీఎస్-సికింద్రాబాద్ తదితర మార్గాల్లో ఈ బస్సులను నడపనున్నట్లు ప్రకటించారు సజ్జనార్. ఇంకా ఆయా బస్సులు ప్రారంభమయ్యే సమయాలను సైతం వెల్లడించారు.

courtesy:https://telugu.news18.com/news/telangana/tsrtc-has-purchased-intelligent-ticket-issue-machines-to-book-tickets-on-buses-up-to-15-minutes-in-advance-prv-1313500.html


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox