తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది

7 ప్రాజెక్టుల డీపీఆర్‌లను గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఇచ్చిన ప్రభుత్వం

హైదరాబాద్: గోదావరి నదిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర జలశక్తి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం అనుమతుల్లేని ప్రాజెక్టులకు జులై 14లోగా అనుమతులు  తీసుకోవాల్సింది. అందుకు  కోసం రాష్ట్ర ప్రభుత్వం 7 ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్ర జలసంఘం, గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఇచ్చింది.

వాటి పరిశీలనా ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఏడింటికి గానూ ఇప్పటికే మూడు ప్రాజెక్టులు ప్రక్రియను పూర్తి చేసుకొని తుది ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. చిన్న కాళేశ్వరం, చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి, చనాకా-కొరాటా ప్రాజెక్టులను జలసంఘం టీఏసీకి నివేదిస్తూ ఏప్రిల్ నెలలో జరిగిన జీఆర్ఎంబీ సమావేశం నిర్ణయం తీసుకొంది.

తరువాతి సమావేశంలో చర్చ.. దేశంలోని వివిధ ప్రాజెక్టుల కోసం నిర్వహించే తదుపరి టీఏసీ సమావేశంలో ఈ మూడు ప్రాజెక్టులకు ఆమోదముద్ర పడుతుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. గూడెం ఎత్తిపోతల, మొడికుంటవాగులకు కూడా అనుమతుల ప్రక్రియ పూర్తయ్యింది. రెండు ప్రాజెక్టులను సీడబ్ల్యూసీ గోదావరి బోర్డుకు పంపింది. తదుపరి జరగనున్న బోర్డు సమావేశంలో వీటిపై చర్చిస్తారు. కీలకమైన సీతారామ ఎత్తిపోతల, సమ్మక్కసాగర్ ఆనకట్టలను కేంద్ర జలసంఘం గోదావరి బోర్డుకు పంపాల్సి ఉంది.

ఈ రెండు ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. సీతారామ ఎత్తిపోతలకు నీటి లభ్యతకు సంబంధించిన హైడ్రాలజీ అనుమతులు వచ్చాయి. ఇతర డైరెక్టరేట్ల నుంచి కూడా అనుమతుల ప్రక్రియ పూర్తయ్యిందని చెపుతున్నారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి తుది అనుమతులు కూడా త్వరలోనే వస్తాయని అంటున్నారు. సమ్మక్కసాగర్‌కు సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉందని  తెలిపారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం