పసిడి ప్రియులకు షాక్.. ఇక భారీగా పెరగనున్న బంగారం ధరలు
కొత్త నిబంధనలు జూన్ 30 నుంచే అమల్లోకి
న్యూదిల్లీ: కేంద్ర ప్రభుత్వం బంగారం కొనగొలుదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. బంగారం దిగుమతులపై తాజాగా సుంకాన్ని పెంచింది. ప్రస్తుతం 10.75 శాతం సుంకం ఉండగా దాన్ని 15 శాతానికి చేర్చింది. దీంతో బంగారం దిగుమతులకు తోడు కరెంట్ ఖాతా లోటు (క్యాడ్)కు చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తోంది. దిగుమతి సుంకంలో తాజా మార్పులు జూన్ 30 నుంచే అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. బంగారంపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 7.5 శాతంగా ఉండగా.. అది 12.5 శాతానికి పెరిగింది. దీనికి వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ 2.5 శాతం జత కలుస్తోంది. దీంతో పసిడి దిగుమతుల సుంకం 15 శాతానికి చేరుకుంటుంది.
తాజాగా పుత్తడి దిగుమతుల్లో జోరు పెరిగింది. మే నెలలో 107 టన్నుల బంగారం దిగుమతి చేసుకోగా.. జూన్‌లోనూ ఇదే స్థాయిలో నమోదుకానున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ విధమైన పసిడి దిగుమతుల కారణంగా కరెంట్ ఖాతాపై ఒత్తిడి పడుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ భావిస్తోంది. తద్వారా లోటు పెరుగుతున్నట్లు పేర్కొంది. ఇక విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తరలిపోతుండటంతో పాటు దిగుమతి వ్యయాలు పెరగడంతో ఫారీన్ మారక నిల్వలు తరుగుతున్నట్లు తెలిపింది. డాలరుతో మారకంలో రూపాయి విలువ భారీగా పతనమవుతూ వస్తోంది.

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox