చంద్రబాబు ఈసారి గెలవడంపై దృష్టి పెడితే మంచిది: మంత్రి ఆర్కే రోజా
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు కూడా రావని జోస్యం
తిరుపతి జిల్లా: చంద్రబాబు ఈసారి తన సొంత నియోజకవర్గంలో గెలవడంపై దృష్టి పెడితే మంచిదని ఏపీ మంత్రి ఆర్కే రోజా హితవు పలికారు. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో పుట్టిన తనకు శ్రీనివాసుడి ఆశీస్సులతో మంత్రిగా అవకాశం దక్కిందని చెప్పారు. ఆయన ఆశీర్వాదబలంతోనే రాష్ట్రమంతటా ప్రజల నుంచి సహాయసహకారాలు తనకు అందుతున్నాయని చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలవరంను జిల్లా చేస్తానని చెప్పడాన్ని మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు కూడా రావని రోజా అన్నారు. చంద్రబాబు మరోసారి ఈ రాష్ట్రానికి సీఎం అయితే మొత్తం రాష్ట్రాన్నే అమ్మేస్తారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు వరద బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోని ఈ పెద్దాయన రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన విషయం రాష్ట్ర ప్రజలు గుర్తించారని చెప్పారు. 14 ఏండ్ల పాటు అధికారంలో ఉన్నా కుప్పంను మున్సిపాలిటీ చేయాలన్న సోయి లేకపోయిందని దుయ్యబట్టారు.
పోలవరం ప్రాజెక్టును అధికారంలో ఉన్న ఐదేండ్ల పాటు ఏటీఎం కార్డులా వాడుకున్నారని రోజా ఘాటుగా విమర్శలు చేశారు. పోలవరాన్ని పూర్తి చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. వరదలు తగ్గిన తర్వాత పలు ప్రాంతాల్లో పర్యటనలంటూ వెళ్లిన చంద్రబాబు.. అక్కడ ఏం చేశారో.. ఎందుకు చేశారో ఆ రాజకీయాలను ప్రజలకు గుర్తించారన్నారు. వరద బాధితులకు రెండు వేల రూపాయలు అందించడంతో పాటు వాలంటీర్ల ద్వారా రేషన్ సరుకులు, పాలు అందజేసి ఇతర వసతులను కల్పించి సీఎం జగన్ అందరి మన్ననలు పొందారని తెలిపారు.

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox