జవహరీ మృతి చెందలేదని సంచలన ప్రకటన చేసిన తాలిబన్‌

జవహరీ మరణం పై ఎటువంటి ఆధారాలు లేవన్న తాలిబన్లు

హైదరాబాద్: అల్‌ఖైదా అగ్రనాయకుడు అమాన్‌ అల్‌-జవహరీని అమెరికా సైన్యం అంతమొందించినట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో జరిపిన డ్రోన్‌ దాడిలో అల్‌-జవహరీని హతమార్చినట్లు స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. కాగా,  అల్‌-జవహరీ మృతి పట్ల తాలిబన్‌లు సంచలన ప్రకటన చేశారు.

జవహరీ మృతి చెందలేదని తాలిబన్లు ప్రకటించారు. జవహారీ చనిపోయినట్లు ఆధారాలు లేవని, ఆయన మృతి విషయంపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. ఈజిప్టు సర్జన్‌ అయిన అల్‌-జవహరీ ప్రపంచంలోని మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుల్లో ఒకరిగా మారారు. 2001 సెప్టెంబర్‌ 11న (9/11 హైజాక్‌) అమెరికాపై జరిపిన ఉగ్రదాడుల్లో 3వేల మంది మరణించారు. ఈ దాడికి పాల్పడిన సూత్రధారుల్లో అల్‌ జవహరీ ఒకరు. అమెరికా దళాలు 2011లో ఒసామా బిన్‌లాడెన్‌ను హతమార్చిన తర్వాత అల్‌-ఖైదా పగ్గాలను జవహరీ స్వీకరించాడు.

జవహరీపై 25 మిలియన్‌ డాలర్ల రివార్డును అమెరికా ఇప్పటికే ప్రకటించింది. కాబూల్‌లో జవహరీ మృతికి సంబంధించి డిఎన్‌ఏ ఆధారాలు లేవని అమెరికా ధృవీకరించింది. అయితే అనేక ఇతర మూలాల ద్వారా అతను చనిపోయినట్లు గుర్తించినట్లు వైట్ హౌస్ తెలిపింది. ఇదిలా ఉండగా అమెరికా, తాలిబన్‌ల పరస్పర విభిన్న ప్రకటనలతో అల్‌ఖైదా అధినేత జవహరీ మృతి ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం