ఆయన ఆశ, శ్వాస అంతా తెలంగాణయే... తెలంగాణ జాతిపిత ప్రొ॥ జయశంకర్ సార్ (Prof. Jayashanker sir) జయంతి నేడు‌

ప్రొ॥ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో వేడుకలు

ఆయన శ్వాస, ధ్యాస అంతా తెలంగాణ కోసమే.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జీవితాన్ని అంకితం చేసిన యోధుడతను. చివరి శ్వాస తెలంగాణ నినాదాన్ని ఆపలేదు. ప్రత్యేక రాష్ట్రమే అంతిమ లక్ష్యంగా ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రొఫెసర్ ఆయన. తెలంగాణ ఎందుకు అవసరమో చెబుతూ రాష్ట్ర విభజనను న్యాయబద్ధంగా కోరుకున్న మలిదశ ఉద్యమకారుడతను. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయ్యే నాటికి ఆయన లేక పోయినా ఆయన కన్న కళ మాత్రం ఎట్టకేలకు సాకారం అయ్యింది.

ఆయనే ప్రొ॥ జయశంకర్ సార్ (Prof. Jayashanker sir). ఆయన జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నవనిర్మాణ సారథిని శ్రద్ధాంజలి ఘటిద్దాం...ప్రొ॥ జయశంకర్ సార్ (Prof. Jayashanker sir) వరంగల్ జిల్లా, ఆత్మకూరు మండలం, అక్కంపేట్ గ్రామంలో లక్ష్మికాంతారావ్, మహాలక్ష్మి దంపతులకు ఆగస్ట్ 6, 1934 లో జన్మించారు. జయశంకర్ సార్ విద్యాభ్యాసం హన్మకొండ (వరంగల్)లో సాగింది. ఆయన ఎమ్.ఏ. (ఎకనామిక్స్)ను - బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి, పి.హెచ్.డి. (ఎకనామిక్స్) ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పొందారు. ప్రొ॥ జయశంకర్ గారు సి.ఐ.ఇ.ఎఫ్.ఎల్. (1982-91) రిజిష్ట్రార్ గా పని చేశారు. 1991-94 మధ్య కాకతీయ విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్ గా పని చేశారు.

గవర్నమెంట్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీగా కూడా పని చేశారు. ప్రొ॥ జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తల్లడిల్లుతున్న తెలంగాణ, తెలంగాణ రాష్ట్రంపై విస్తృత అంగీకారం- నిజానిజాలు అనే రచనలు చేశారు. తన స్వీయ చరిత్ర "వొడవని ముచ్చట్లు"ను కొంపల్లి వెంకట గౌడ్ రచించారు. కొత్తపల్లి జయశంకర్ ను ప్రొ॥ జయశంకర్ సార్ (Prof. Jayashanker sir) గా పిలుస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఎలా అవసరమో కోసం ముందుగా చెప్పిన వ్యక్తి. 1950లో ఫజల్ అలీ కమిషన్ ముందు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు మొదటి సారిగా తమ వాదనను వినిపించారు. తర్వాత పలు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

తెలంగాణ నినాదం వినిపించిన ప్రతి నాయకుడికి  జయశంకర్ సార్ (Prof.Jayashanker sir) అండగా నిలిచారు. తన రాతల ద్వారా, ఉపన్యాసాల ద్వారా తెలంగాణ సమాజంలో రాష్ట్ర ఏర్పాటుకు చైతన్యాన్ని కల్పించారు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ ఉద్యమాల నుంచి మలి ఉద్యమాల వరకు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తొలి, మలి దశ ఉద్యమాలకు వారధిగా జయశంకర్ సార్ (Prof. Jayashanker sir) ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర సమితికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు, సంప్రదింపుల్లో జయశంకర్ సారు కీలక పాత్ర పోషించారు.

2009 డిసెంబర్ 9 న చిదంబరం తెలంగాణ ప్రకటన వెనక జయశంకర్ సార్ కృషి ఎంతో ఉంది. ఆయన ఎక్కడ ఎటువంటి స్థితిలో ఉన్నా, ఏ హోదాలో పని చేస్తున్నా తెలంగాణ కోసమే ఉన్నారు. తెలంగాణ కోసమే పనిచేశారు. కానీ తెలంగాణ రానున్న కొద్ది రోజుల ముందే తీవ్ర అనారోగ్యంతో 21 జూన్ 2011 నాడు "కడుపు క్యాన్సర్" తో మరణించారు. తన తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాడిన మహనీయుడు ప్రొ॥ జయశంకర్ సార్ (Prof. Jayashanker sir). 

ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్ కు మంత్రి హ‌రీశ్‌రావు నివాళులు 
తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంతకర్త ప్రొఫెస‌ర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు నివాళుల‌ర్పించారు. మీరు చూపిన మార్గం, ఉద్యమ పాఠాలు, చైతన్యం.. యావత్తు తెలంగాణ సమాజం గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటార‌ని పేర్కొన్నారు. సార్ ఆశించిన‌ట్లుగా స్వ‌యం పాల‌న సాకార‌మై, సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ దేశానికే ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు.

తెలంగాణ భవన్‌లో జయశంకర్ సార్ జయంతి వేడుకలు
తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్ జ‌యంతి వేడుక‌లను తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించారు. జ‌య‌శంక‌ర్ సార్ విగ్ర‌హానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మ‌హ‌ముద్ అలీ, రాష్ట్ర ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు బోయిన్‌ప‌ల్లి వినోద్ కుమార్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం