అప్పు తీసుకున్న వారిని వేధిస్తే.. కఠిన చర్యలు: ఆర్బీఐ

రుణ రికవరీ ఏజెంట్లకు రిజర్వ్ బ్యాంక్ కీలక ఆదేశాలు

హైదరాబాద్: రుణ గ్రహితలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయా రుణ కంపెనీలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. శనివారం, రుణ రికవరీ ఏజెంట్లకు రిజర్వు బ్యాంకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రుణ రికవరీ ఏజెంట్లు ఉదయం 8 గంటలకు ముందు, రాత్రి 7 గంటల తర్వాత రుణ గ్రహీతలకు ఫోన్లు చేయవద్దని ఆదేశించింది. ఈ మేరకు బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీలు, ఇతర రుణ సంస్థలు చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

రుణాలు ఇచ్చే సంస్థలు వారి ఉద్యోగులు గానీ, వారి ఏజెంట్లు గానీ రుణ గ్రహీతలపై ఎలాంటి మానసిక, శారీరక వేధింపులకు పాల్పడకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. అలాగే రుణ గ్రహీతలకు ఎలాంటి తప్పుడు సమాచారం, బెదిరింపులతో కూడిన మెసేజీలు చేయడానికి వీలు లేదని హెచ్చరించింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, కో ఆపరేటివ్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్ బీ ఎఫ్ సీ), అసెట్ రీకన్ స్ట్రక్షన్ కంపెనీలు సహా దేశంలోని అన్ని ఆర్థిక, రుణ సంస్థలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.

ఇటీవల రుణ గ్రహీతలపై లోన్ రికవరీ ఏజెంట్లపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సూచనలు చేస్తున్నామని పేర్కొంది. ఇప్పటికే ఉన్న నిబంధనలు, మార్గదర్శకాలకు ఇవి అదనమని తెలిపింది. కాగా, వాయిదాలు సరిగా కట్టలేని వారిపై రుణ రికవరీ ఏజెంట్లు తీవ్ర వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఈ సూచనలు చేసింది.  


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం