జీతం రూ.70 వేలు.. కనీసం డిసిగ్నేషన్ రాయలేరు
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉట్టిపడుతున్న నిరక్షరాస్యత.!
అనంతపురం: జీతం రూ.50వేల నుంచి రూ.70 వేలు తీసుకుంటున్న ఉద్యోగులు కనీసం తమ డిసిగ్నేషన్ కూడా రాయలేక పోతున్న ఘటన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉట్టిపడుతోంది. విశ్వవిద్యాలయంలో ఎక్కువ మొత్తంలో వేతనాలు పుచ్చుకుంటున్న ఉద్యోగులు నిరక్షరాస్యులు ఎక్కువైపోయారు.
ఇంగ్లిష్‌లో చిన్న పదం కూడా రాయలేని పరిస్థితి వారికి తలెత్తుతోంది. దీంతో పాలనా పరంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎస్కేయూలో దాదాపు 40 మంది జూనియర్ అసిస్టెంట్లు తమ 'డిజిగ్నేషన్' కూడా ఇంగ్లిష్‌లో సరిగా రాయలేని దుస్థితిలో ఉన్నారు. కనీసం ఒక లెటర్‌ను టైప్ చేసి ఉన్నతాధికారులకు పంపడం కూడా వీరికి రావడం లేదు. ఒకప్పుడు డైలీ వేజ్ కింద వారంతా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగాన్ని పర్మినెంట్ చేసుకుని రికార్డు అసిస్టెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి దక్కించుకున్నారు.
అయితే అందుకు తగ్గ నైపుణ్యాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఏదైనా ఫైల్ డ్రాఫ్టింగ్ చేసి ఉన్నతాధికారులకు పంపలేకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇటీవలే వీరందరికీ ప్రత్యేకంగా కంప్యూటర్ నైపుణ్యం శిక్షణ అందించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారందరినీ నైపుణ్యం లేని విధుల్లో నియమించాలని ఉన్నతాధికారులు భావించారు. అయితే జూనియర్ అసిస్టెంట్ల కొరత ఏర్పడుతుందనే ఉద్దేశంతో వారిని ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై వర్సిటీ ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox