9 నెలలు పరీక్షలు చేసి.. ప్రసవానికి వెళ్తే కడుపులో బిడ్డ లేదన్నారు.!
ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
కాకినాడ: కాకినాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భవతి అని చెప్పి 9 నెలల పాటు ఓ మహిళను ఆసుపత్రి చుట్టూ తిప్పించుకుని తీరా 9 నెలలు కాగానే ప్రసవం తేదీన వెళితే శిశువు లేదని వైద్యులు తెలిపారు. దీంతో ఖంగుతిన్న కుటుంభ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
బాధితురాలి తల్లి కమలాదేవి విలేకరులకు తెలిపిన కథనం ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన మహాలక్ష్మికి యానాంకు చెందిన వి.సత్యనారాయణతో కొన్నేళ్ల కిందట వివాహమైంది. ఈ ఏడాది జనవరిలో తన భార్యను వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ గాంధీనగర్‌లోని రమ్య ఆసుపత్రికి తీసుకొచ్చారు.
ఆరోజు పరీక్ష చేసిన వైద్యులు మహాలక్ష్మి గర్భవతి అని రిపోర్టు ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె పరీక్షల కోసం తరచూ ఆసుపత్రికి వచ్చేవారు. వైద్యులు స్కానింగ్, మందులు రాసిచ్చేవారు. ఆరో నెలలో స్కానింగ్ తీసి, సెప్టెంబరు 22న ప్రసవం అవుతుందని చెప్పారు. ఆ తర్వాత మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లారు. కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు ఆసలు ఆ అమ్మాయి గర్భవతే కాదని తేల్చి చెప్పారు. దీంతో మహాలక్ష్మిని కాకినాడ రమ్య ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యురాలిని ప్రశ్నించగా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పారు.
దీంతో మహాలక్ష్మి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ మేరకు ఆమె విలేకరులతో తన ఆవేదనను వెల్లిబుచ్చుకున్నారు. తొమ్మిది నెలల నుంచి తమను ఆసుపత్రికి తిప్పి రూ.వేలల్లో డబ్బులు ఖర్చు పెట్టించారని వాపోయారు. బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందంటూ ప్రతి నెలా మందులు రాసిచ్చారని, వాటిని వాడాక తమ కుమార్తె పొట్ట పెద్దదైందని తల్లి కమలాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ఎదుట వారు ఆందోళనకు దిగారు. బాధితులకు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox