నేటి నుంచి బతుకమ్మ చీరెల పంపిణీ

కోటి చీరలను పంపీణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరెల పంపిణీ ప్రారంభమైంది.  ఈ నెల 25 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు ఆడ పడుచులకు ప్రభుత్వం చీరెలను సారెగా అందిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ కానుకలను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతోపాటు, ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న ఉధాత్తమైన ఉభయతారక లక్ష్యంతో కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించినట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమానికి.. ఇప్పటికే అన్ని జిల్లాల కలెకర్లతో సమన్వయం చేసుకుంటూ, తమ టెక్స్‌టైల్‌ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు.

ఈ సంవత్సరం 24 విభిన్న డిజైన్లు, పది రకాల ఆకర్షణీయ రంగుల్లో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచుల)తో తయారు చేయబడిన 100శాతం పాలిస్టర్ ఫిలిమెంట్ నూలు చీరలను టెక్స్‌టైల్‌ శాఖ తయారు చేసిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సంక్షోభంలో చిక్కుకున్న నేతన్నలకు ఒక గొప్ప భరోసా వచ్చిందని, వారి వేతనాలు రెట్టింపు అయ్యాయన్నారు.

తద్వారా వారు తమ కాళ్లపైన తాము నిలబడే పరిస్ధితికి చేరుకున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. మహిళలకు 92లక్షల సాధారణ చీరెలు, వయోవృద్ధులకు తొమ్మిది మీటర్ల పొడువున్న చీరెలు 8 లక్షలు తయారు చేయించామన్నారు. మొత్తంగా కోటి చీరెలను రాష్ట్రంలో ఆహార భద్రతా కార్డు కలిగిన ప్రతీ ఆడబిడ్డకు అందించనున్నట్లు చెప్పారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox