నేడు 13వ రోజుకి చేరిన అమరావతి రైతుల మహాపాదయాత్ర.. అడుగడుగునా ఆంక్షలు

గుడివాడలో తనిఖీల పేరుతో ఆంక్షలు.. గుడివాడ పట్టణంలో 30 పోలీస్ యాక్ట్ అమలు

గుడివాడ: అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 13వ రోజుకు చేరింది. కృష్ణా జిల్లా కౌతవరం నుంచి రైతులు ఇవాళ ఉదయం పాదయాత్ర ప్రారంభించారు.  పాదయాత్రలో పాల్గొనేందుకు భారీగా తరలివెళ్తున్న రైతులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలను టోల్‌గేట్ వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు. గుడ్లవల్లేరు, అంగలూరు మీదుగా సాగుతోన్న పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధిస్తుండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.

ఈ క్రమంలో కంకిపాడు మండలం దావులూరు టోల్‌గేట్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గుడివాడ నియోజకవర్గానికి వచ్చే అన్ని రూట్లలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇటు విజయవాడ నుంచి పామర్రు, గుడ్లవల్లేరు వరకు, మచిలీపట్నం నుంచి గుడివాడ రోడ్డు, విజయవాడ-గుడివాడ, గుడివాడ-ఏలూరు రహదారుల్లో భారీగా పోలీసులు మోహరించారు.

దొండపాడు నుంచి వస్తున్న రైతులను గుడివాడ రోడ్డులో అడ్డుకున్న కంకిపాడు పోలీసులు.. కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు గుడివాడ పట్టణంలో 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు గుడివాడ వన్ టౌన్ పోలీసులు ప్రకటించారు. పాదయాత్రలో హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా నడుచుకుంటే చర్యలు తీసుకుంటామని పత్రికా ప్రకటన ద్వారా పోలీసులు హెచ్చరించారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox