23 ఏళ్ల వయస్సులోనే ఉరికొయ్యను ముద్దాడిన విప్లవ వీరుడు భగత్ సింగ్ (Bhagath Singh) జయంతి నేడు.. ప్రత్యేక కథనం
భగత్ సింగ్ (Bhagath Singh) జయంతి సందర్భంగా ఆ మహనీయుడి త్యాగశీలతను స్మరించుకుందాం..
భగత్ సింగ్ (Bhagath Singh) పేరు వింటేనే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండిపోతుంది. రోమాలు నిక్కబొరచుకుంటాయి. బ్రిటీషర్లపై తిరుగుబాటుచేసి దేశ స్వాతంత్రం కోసం 23 ఏళ్ల వయస్సులోనే ఉరికొయ్యను ముద్దాడాడు. మార్చ్ 23, 1931 రాత్రి 7:30 గంటలకి తన సహచరులైన విప్లవయోధులు సుఖ్ దేవ్, రాజ్ గురుతో పాటు ఆయన అసువులు బాశారు. నిరంకుశ బ్రిటీషు ప్రభుత్వం వారి ముగ్గురిని వరుసగా నిలుచోబెట్టి ఉరితీసింది.
ఉరికంబం ఎక్కి కూడా ఆ ముగ్గురు చిరునవ్వుతో మృత్యువుని ముద్దాడారు. భగత్ సింగ్ (Bhagath Singh) ప్రస్తుతం పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రాంతంలోని కధ్కర్ కలాన్ అనే గ్రామంలో 1907 సెప్టెంబర్ 28న, తల్లి విద్యావతి, తండ్రి కిషన్ సింగ్ దంపతులకు జన్మించారు. భాగత్ సింగ్ తాతా అర్జున్ సింగ్ స్వామి దయానంద సరస్వతీకి అనుచరుడు ఆయన హిందూ సంస్కరణ ఉద్యమంలోనూ పాల్గొన్నాడు. అతని ప్రభావం భగత్ సింగ్ (Bhagath Singh) పై అమితంగా ఉండేది. ఈ తరుణంలో మహాత్మా గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం భగత్ సింగ్ (Bhagath Singh) పై తీవ్ర ప్రభావం చూపింది.
ఆ స్వాతంత్ర పోరాటంలో ఆయన మొదటి సారి పాల్గొన్నాడు. అప్పుడు భగత్ వయస్సు పదమూడేళ్లే కావటం విశేషం. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా బ్రిటీషు పుస్తకాలు, వస్తువులు, దుస్తువులు అన్నీ తగుల బెట్టాడు. మొదట్లో గాంధీ చేస్తున్న అహింసాయుత ఉద్యమంలో ప్రభావితమైన భగత్ కాలక్రమేనా దెబ్బకు దెబ్బ విధానంతో హింసాయుత ఉద్యమం కూడా ముఖ్యమే అనుకుని అందులో భాగస్వాములయ్యడు. 1919 లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఉదాంతం ఆయన్ను కలచివేసింది. దాంతో అతనిలో బ్రిటీషు వారిపై ఉన్న కోపం మరింత పెంచింది.
1923లో బీఏ చదువు కోసం లాహోర్ లోని నేషనల్ కాలేజీలో చేరాడు. ఆ తరుణంలోనే అతని తండ్రి వివాహ సంబంధాలు చూస్తుండటంతో భగత్ సింగ్ (Bhagath Singh) ఓ లేఖను రాసి 1923లోనే దిల్లీకి వెళ్లిపోయాడు. తర్వాత కాలంలో లాహోర్ లో మకాం మార్చాడు. తండ్రికి రాసిన ఉత్తరంలో 'నా జీవితం దేశం కోసం అంకితం.. అది తప్ప నాకే కోరిక లేదని' స్పష్టం చేశాడు. అదే ఏడాది భగత్ సింగ్ (Bhagath Singh) హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ లో చేరాడు. అనంతరం 1926 మార్చి 13న 'నౌ జవాన్ భారత సభ'లో చేరి అందులో చురుకైన పాత్ర పోషించాడు.
ఆ సంఘం ద్వారా యువకులను ఆకర్శించి సాంత్రంత్ర ఉద్యమ సాధనకు వారిని పురిగొల్పాడు. అదే సమయంలో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా 'గో బ్యాక్ సైమన్' అంటూ ఉద్యమ జ్వాలలు చెలరేగుతున్నాయి. అందులో భాగంగా లాహోర్ లోని బ్రిటీష్ సైన్యానికి వ్యతిరేకంగా లాలాలజపతి రాయ్ ఎదురొడ్డి నిలిచారు. బ్రిటీష్ అధికారి శాండర్స్ లాలాలజపతి రాయ్ పై లాఠీతో విరుచుకుపడ్డాడు.
దీంతో రాయ్ నెలకొరిగారు. అతని మరణం భగత్ సింగ్ (Bhagath Singh), సుఖ్ దేవ్, రాజ్ గురూలను కలచివేసింది. దాంతో ముగ్గురు యోధులు చమర్చిన కళ్లతోనే 1928 డిసెంబర్ 17న లాలాలజపతిరాయ్ మరణానికి కారణమైన లాఠీకి ప్రతీకారంగా శాండర్స్ ను కాల్చి వేశారు. ఆ హత్యకు కారణమైన వారిని మట్టుబెట్టాలని బ్రిటీష్ ప్రభుత్వం ప్రతీనబూనింది. 1929 ఏప్రిల్ 8న తెల్లదెరల పార్లమెంటు పై బాంబు విసిరారు. ఈ సందర్భంలోనే భగత్, రాజ్ గురూ, సుఖ్ దేవ్ అరెస్టయ్యారు. దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు. అనంతరం శాండర్స్ హత్యోదాంతంపై బ్రిటీష్ ప్రభుత్వం ఆ ముగ్గురిపై హత్యారోపణ మోపింది. 1929 జూన్ 4న కోర్టులో బాంబు కేసుపై విచారణ ప్రారంభమైంది.
కోర్టులోనే వారు బ్రిటీష్ వ్యతిరేక నినాదాలు చేశారు. 1930 అక్టోబర్ 6న కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. ఉరికంబం ఎక్కే కొద్ది రోజుల ముందు.. 'నేను చనిపోతే దేశానికి అదో ఉత్పాతంగా మిగిలిపోతుంది. అదే నేను మృత్యువును హత్తుకుంటే భారత తల్లులందరూ మరో భగత్ పుట్టాలని కోరుకుంటారని' తన మాతృమూర్తితో చివరి దశలో అన్నాడు.
తన బిడ్డ చనిపోయే ముందు 'ఇంక్విలాబ్ జిందాబాద్ (విప్లవం వర్ధిల్లాలి)' అంటూనే నెలకొరిగాడని అతని మరణం యావత్ ప్రపంచం గుర్తించుకుంటుదని శోకాతప్త హృదయంతో ఆ తల్లి వెల్లడించింది. వారి మరణం యావత్ యువకులను మేల్కొలిపింది. స్వాంతంత్ర కాంక్షను మరింత రగిల్చింది. చివరికి 1947 ఆగస్ట్ 15 న దేశానికి స్వాతంత్రం లభించింది.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox