ఇప్పటం పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష జరిమానా

తప్పుడు సమాచారం ఇచ్చి మధ్యంతర ఉత్తర్వులు తీసుకున్నారంటూ హైకోర్టు వ్యాఖ్య

అమరావతి: ఇప్పటం పిటిషనర్లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఇప్పటం గ్రామంలో అధికారులు పలు కూల్చివేతలు చేపట్టిన తరుణంలో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే గ్రామంలో కూల్చివేతలకు ముందు నోటీసులు ఇచ్చినా, నోటీసులు ఇవ్వలేదంటూ బాధితులు తమ పిటిషన్లలో పేర్కొనడం పట్ల హైకోర్టు మండిపడింది. కోర్టును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

ఈ క్రమంలో ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున జరిమానా విధించింది. ఈ కేసులో హైకోర్టు గతంలో స్టే ఇవ్వగా, ఇవాళ ఇరువర్గాల వాదనలు పరిశీలించింది. ఇళ్ల కూల్చివేతలపై తమకు ప్రభుత్వం ముందస్తు నోటీసులు ఇవ్వలేదని పిటిషన్ దారులు పేర్కొనగా, నోటీసులు ఇచ్చిన తర్వాత ఆక్రమణలు కూల్చివేశామని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు.

ఈ తరుణంలో, నోటీసులు ఇచ్చింది నిజమేనని హైకోర్టు గుర్తించడంతో తప్పుడు సమాచారం ఇచ్చి మధ్యంతర ఉత్తర్వులు తీసుకున్నారంటూ హైకోర్టు ఆరోపించింది. మొత్తం 14 మంది పిటిషన్ దారులకు హైకోర్టు భారీ జరిమానా విధించింది.

 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం