అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachan) పేరు, ఫొటో వాడటానికి వీలు లేదు.. కోర్టు ఆదేశం

అమితాబ్ అనుమతిస్తే పేరు, ఫోటో వినియోగించుకోవచ్చన్న కోర్టు

దిల్లీ: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachan) వ్యక్తిగత హక్కులపై దిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అమితాబ్‌ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఉన్న కంటెంట్‌ను తొలగించాలని ఐటీ శాఖ అధికారులు, టెలికాం సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించింది. అంతే కాకుండా నటుడి అనుమతి లేకుండా ఏ వ్యక్తి గానీ, సంస్థ గానీ ఆయన పేరు, ఫొటో, గళాన్ని ఉపయోగించకూడదని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

వాణిజ్యపరమైన కార్యక్రమాల్లో అనుమతి లేకుండా తన పేరు, ఇమేజ్‌, వాయిస్‌, వ్యక్తిగత లక్షణాలను ఉపయోగించడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ అమితాబ్‌ నేడు దిల్లీ హైకోర్టులో సివిల్‌ దావా వేశారు. నటుడి తరఫున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.

''అనేక కారణాలతో ఈ పిటిషన్‌ వేయాల్సి వచ్చింది. కొందరు టీ-షర్టులు తయారు చేసి నటుడి ఫొటోను వేస్తారు. మరికొందరు ఆయన పోస్టర్లను విక్రయిస్తారు. కొందరైతే అమితాబ్‌బచ్చన్‌.కామ్‌ అంటూ డొమైన్‌ క్రియేట్‌ చేసి వెబ్‌సైట్‌ కూడా పెట్టేస్తారు. అందుకే మేం కోర్టుకు రావాల్సి వచ్చింది'' అని సాల్వే వాదించారు.

ఈ వాదనల అనంతరం ఈ పిటిషన్‌పై న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని సంస్థలు వారి ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేసేందుకు నటుడి అనుమతి లేకుండానే ఆయన సెలబ్రిటీ హోదాను ఉపయోగించడం ఆయనను బాధించిందని కోర్టు గుర్తించింది.

ఇలాంటి వాటిని నిషేధించకపోతే కొన్ని కార్యకలాపాల వల్ల అమితాబ్‌కు చెడ్డ పేరు రావడంతో పాటు, ఆయనకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని న్యాయస్థానం పేర్కొంది. అందుకే అమితాబ్‌ అనుమతి లేకుండా ఆయన పేరు, ఇమేజ్‌, గళాన్ని ఎవరూ ఉపయోగించకూడదని కోర్టు స్పష్టం చేసింది.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox