కుమార్తె ప్రేమవివాహం.. విచక్షణ రహితంగా దాడిచేసిన అమ్మాయి బంధువులు

కర్నూలు జిల్లాలో ఘటన

కర్నూలు(పెద్దకడబూరు): ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకునిపై అమ్మాయి తండ్రి, బంధువులు కొడవళ్లు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని హెచ్‌.మురవణి నాలుగవ మైలు రాయి వద్ద గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసలు, బాధితురాలు తెలిపిన కథనం మేరకు..  హెచ్‌.మురవణి గ్రామానికి చెందిన ఉసేని కూతురు సుకన్య(24), అదే గ్రామానికి చెందిన పెద్ద ఈరన్న కుమారుడు వీరేష్‌(28)ను ఫిబ్రవరిలో ప్రేమ వివాహం చేసుకుంది.

ప్రేమ వివాహం అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో ఎమ్మిగనూరు పట్టణంలో వేరే కాపురం పెట్టారు. దీంతో కక్ష గట్టిన అమ్మాయి తరఫు బంధువులు  వీరేష్‌ తన భార్యను బైక్‌పై తీసుకొస్తుండగా అమ్మాయి తండ్రి ఉసేని, వారి బంధువులు ఆటోతో హెచ్‌.మురవణి నాలుగవ మైలురాయి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఇద్దరూ కింద పడిపోవడంతో వీరేష్‌పై విచక్షణ రహితంగా దాడిచేసి చనిపోయాడని భావించి అక్కడి నుంచి పారిపోయారు. సుకన్య భయంతో పరుగులు తీసింది. ఎమ్మిగనూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు చెప్పింది.

రహదారిలో వెళ్తున్న కొందరు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయడంతో పాటు చికిత్స నిమిత్తం వీరేష్‌ను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. భార్య సుకన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox