పూలే (Phule) గా ఆయన ఇంటి పేరు ఎందుకు వచ్చింది.. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జీవిత విశేషాలు..

మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం

భారత ప్రథమ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసంస్కర్త అయిన  జ్యోతిరావు పూలే (Phule) మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని వ్యవసాయ తోటమాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్‌ 11న జన్మించాడు. ఆయన తండ్రి గోవిందరావు. గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించేవారు. కాలక్రమేణా పీష్వా పరిపాలనాకాలంలో పూల వ్యాపారం చేయటంతో ఆయన ఇంటి పేరు పూలే (Phule)గా మారింది.

జ్యోతిరావు పసితనంలో ఉన్నప్పుడే తల్లి తనువు చాలించింది. ఏడు సంవత్సరాల వయసులో జ్యోతిరావు ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యను ప్రారంభించాడు. కొన్నాళ్లకే చదువుకు స్వస్థి పలికి తండ్రికి వ్యవసాయంలో సాయంగా ఉండేందుకు నిర్ణయించుకున్నాడు. చదువుమానేసినప్పటికీ పూలే (Phule)కి పుస్తక పఠనం అంటే ఎనలేని మక్కువ. ఆ మక్కువ తోనే ప్రతిరోజూ నిద్రకు ఉపక్రమించే ముందు లాంతరు వెలుతురులో చదువుకునే వాడు.

ఆయనకు చదువుపట్ల ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం ఉపాధ్యాయుడు, మరో ఒక క్రైస్తవ వ్యక్తితో కలిసి జ్యోతిరావు తండ్రిని ఒప్పించి ఆయన విద్యాభ్యాసం కొనసాగేలా చేశారు. ఆయనను 1841లో స్కాటిష్‌ మిషన్‌ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించాడు. జ్యోతిరావ్‌కు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజీ, జార్జ్‌ వాషింగ్టన్‌ల జీవిత చరిత్రలు ఆయన జీవితంపై బాగా ప్రభావితం చేశాయి. వారి ద్వారానే దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి. థామస్‌ రచించిన ‘మానవ హక్కులు’పుస్తకం అతని ఆలోచనలను బాగా ప్రభావితం చేసింది.

జ్యోతిరావు పూలే (Phule) అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశాడు. 1873 సెప్టెంబరు 24న , పూలే (Phule) తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ ట్రూత్) అనే సంస్థ ను ను ఏర్పాటు చేశాడు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఈ సంస్థ పనిచేసింది. సామాజిక సంస్కరణ ఉద్యమంలో మహాత్మా జ్యోతిరావు పూలే (Phule) (Mahatma Jotirao Phule) భారత దేశంలోనే మొట్టమొదటి వ్యక్తిగా పరిగణించబడ్డాడు. ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే (Phule) భారతదేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, పూలే (Phule) దంపతులు భారతదేశంలో బలహీన వర్గాల విద్యకు, స్త్రీ విద్యకు మార్గదర్శకులయ్యారు.

మహిళలకు, అణగారిన వర్గాలకు విద్యను అందించే సంకల్పంతో బాలికల మొదటి పాఠశాలను 1848 లో పూనాలో ప్రారంభించారు. అంతే కాకుండా వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు. బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించవలసిందిగా సామాన్యుల్ని ప్రోత్సహించాడు. సమాజంలో సగ భాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని పూలే (Phule) భావించాడు.

అందువల్ల స్త్రీలు విద్యావంతులు కావాలని గట్టిగా నమ్మేవారు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపాడు. 1948 ఆగస్టులో బాలికలకు పాఠశాల స్థాపించాడు. ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడం, అంటరానివారిని కూడా బోధించవలసిరావడంతో ఉపాధ్యాయులెవరూ ముందుకు రాలేదు. చివరకు జోతిరావ్‌పూలే (Phule) తన భార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు.

బాలికల పాఠశాల నిర్వహణలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కొంతకాలం పాఠశాలను నిర్వహించలేని స్థితికి చేరుకోవడంతో దాన్ని మూసివేశాడు. ఆయన మిత్రులెైన గోవింద్‌, వల్వేకర్‌ల సహాయంతో పాఠశాలను పునఃప్రారంభించాడు. క్రమంగా ఆదరణ పెరగడంతో 1851-52లో మరో రెండు పాఠశాలలు స్థాపించాడు. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని పూలే (Phule) విమర్శించాడు. కుల, మత వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు.

స్త్రీ, పురుషుల మధ్య లింగవివక్షను పూలే (Phule) విమర్శించాడు. సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించాడు. 1871 లో సత్యశోధక సమాజం తరపున ‘దీనబంధు’వార పత్రిక ప్రారంభించాడు. 1880లో భారత ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ పితామహుడు లోఖాండేతో కలసి రెైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు. 1873లో ‘గులాంగిరి’(బానిసత్వం) పుస్తకం ప్రచురించాడు. వీటిలో బ్రాహ్మణీయ అమానుష సూత్రాలను, శూద్రులు- అతి శూద్రులపై బ్రాహ్మణీయుల క్రూర వెైఖరిని పూలే (Phule) తులానాత్మకంగా పరిశీలించాడు.

సహపంక్తి భోజనాలను ప్రోత్సహించాడు. ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా వ్యక్తీకరించాడు. దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాలలాంటి వాళ్లు అని చెప్పాడు. అగ్రకులాల కింద బానిసలుగా బతుకుతున్న కిందికులాల వారిలో తమ బానిసత్వంపట్ల ఆయన చెైతన్యం తీసుకొచ్చారు. సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారత దేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మ పూలే (Phule) తన గురువు అని బీఆర్ అంబేద్కర్ ప్రకటించారు. దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మ పూలే (Phule) 1890 నవంబరు 28న స్వర్గస్తులయ్యారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం