ఎట్టకేలకు పోలీసుల అదుపులో గాయకుడు మూసేవాలా హత్యకేసు సూత్రధారి
కాలిఫోర్నియాలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు భారత నిఘా వర్గాల వెల్లడి
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబీ గాయకుడు, రాజకీయ నాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకేసు సూత్రధారి గోల్డీ బ్రార్ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబట్టాడు. కాలిఫోర్నియాలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు భారత నిఘా వర్గాలు తెలిపాయి. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను కాలిఫోర్నియాలో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు రా, ఐబీ, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, పంజాబ్ ఇంటెలిజెన్స్ వర్గాల వద్ద కచ్చితమైన సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే, మూసేవాలా పట్టుబడినట్టు అంతర్జాతీయ వర్గాల నుంచి భారత నిఘా సంస్థలకు సమాచారం అందినప్పటికీ, కాలిఫోర్నియా ప్రభుత్వం నుంచి భారత్‌కు అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. సిద్ధూ మూసేవాలా ఈ ఏడాది మే 29న హత్యకు గురయ్యారు. వీఐపీ కల్చర్‌కు ముగింపు పలికే క్రమంలో పంజాబ్ ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ హత్య జరగడంతో కలకలం రేగింది.
సిద్ధూ తన ఇద్దరు స్నేహితులతో సాధారణ వాహనంలో బయటకు రావడంతో అప్పటికే ఆయన కోసం వేచిచూస్తున్న దుండగులు ఆయనపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యకు ప్రధాన కుట్రదారుగా భావిస్తున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఎట్టకేలకు ఇప్పుడు పోలీసులకు చిక్కాడు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox