శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను ఇరికించిన కేసులో నిందితుల ముందస్తు బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
ముందస్తు బెయిల్ పిటిషన్లపై మళ్లీ విచారణ జరపాలని కేరళ హైకోర్టును సుప్రీం సూచన
న్యూదిల్లీ: ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను 1994 నాటి ఇస్రో గూఢచర్యం వివాదంలో ఇరికించిన కేసులో కేరళ మాజీ డీజీపీ సహా నలుగురు నిందితులకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఈ తరుణంలో వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లపై మళ్లీ విచారణ జరపాలని కేరళ హైకోర్టును సుప్రీం కోరింది.
న్యాయమూర్తులు ఎంఆర్ షా, సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం నిందితుల వ్యక్తిగత ముందస్తు బెయిల్ పిటిషన్లను తాజా పరిశీలన కోసం కేరళ హైకోర్టుకు తిరిగి పంపగా అదే సమయంలో నలుగురు నిందితులను ఐదు వారాల పాటు అరెస్టు చేయవద్దని సీబీఐని సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం ఆదేశించింది. మరోవైపు కేసును తిరిగి హైకోర్టుకు పంపితే అరెస్టు చేయకుండా తమకు రక్షణ కల్పించాలని పిటిషనర్లలో ఒకరి తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు.
కాగా, నంబి నారాయణన్ ను గూఢచర్యం కేసులో ఇరికించిన నిందితుల్లో కేరళ మాజీ డీజీపీ సీబీ మాథ్యూస్, గుజరాత్ మాజీ ఏడీజీపీ ఆర్బీ శ్రీకుమార్, కేరళకు చెందిన ఇద్దరు మాజీ పోలీసు అధికారులు ఎస్ విజయన్, తంపి ఎస్ దుర్గాదత్, రిటైర్డ్ ఇంటెలిజెన్స్ అధికారి పీఎస్ జయప్రకాశ్‌లకు మంజూరు చేసిన బెయిల్ ను సవాల్ చేస్తూ నవంబర్ లో సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox