డెక్కన్‌ మాల్‌ కూల్చివేత షూరు.. టెండర్ ప్రక్రియ పూర్తి!

హైడ్రాలిక్ క్రషర్ డెమోలిషన్ పద్ధతిలో ఈ భవనం కూల్చివేత

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని మినిస్టర్‌ రోడ్డులో అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్‌ మాల్‌ భవనం కూల్చివేత పనులు ప్రారంభం అయ్యాయి. చుట్టుపక్కల ఉన్న భవనాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా హైడ్రాలిక్ క్రషర్ డెమోలిషన్ పద్ధతిలో ఈ భవనాన్ని కూల్చివేయనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాకు పలు విషయాలు తెలిపారు. కూల్చివేత సమయంలో ఇతర భవనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఏజెన్సీకి సూచించారు, ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కూల్చివేత పనులు సజావుగా సాగాలని సూచించారు. డెక్కన్ బిల్డింగ్ సమీపంలోని కమ్యూనిటీ హాల్‌లో ఈ ప్రాంత ప్రజలకు వసతి ఏర్పాటు చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు.

డైమండ్ కటింగ్‌తో భవనం ఒక్కసారిగా కూలిపోకుండా, ఒరిగిపోకుండా కూల్చివేయడం హైడ్రాలిక్ క్రషర్ యంత్రం ప్రత్యేకత. కూల్చివేత ప్రక్రియలో భాగంగా బుధవారం టెండర్ల ప్రక్రియ పూర్తయింది. రూ.33.86 లక్షల అంచనా వ్యయంతో టెండర్ పిలిచి నగరానికి చెందిన ఎస్కే మల్లు ఏజెన్సీకి రూ. 25.94 లక్షలతో పనులు అప్పగించారు. వారం, పది రోజుల్లో డెక్కన్ మాల్ భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తామని అధికారులు తెలిపారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox